దక్షిణ కొరియాపై అద్భుత విజయం.. స్వర్ణం కొట్టిన భారత్!
టర్కీలోని అంటాల్యా నగరంలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3 టోర్నీలో భారత షూటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉత్కంఠభరితంగా సాగిన రికర్వ్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర-కుమ్‌కుమ్ మొహోత్ జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో ప్రపంచ మేటి జట్టు, ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను మట్టికరిపించి ఈ భారత జంట సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఒలింపిక్ ఛాంపియన్లపై భారత జోడి విజయం
ఆదివారం(జూన్ 14) జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన పతకపోరులో.. భారత స్టార్ ఆర్చర్ ధీరజ్, 17 ఏళ్ల సంచలనం కుమ్‌కుమ్ మొహోత్ జోడీ దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ కిమ్ జే డియోక్ - ఓ యేజిన్‌లతో తలపడింది. ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ హోదా ఉన్న కొరియా జోడీపై భారత షూటర్లు గురి తప్పని బాణాలతో విరుచుకుపడ్డారు. అత్యంత ఒత్తిడితో కూడిన ఈ ఫైనల్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి కొరియాను ఓడించి పసిడి పతకాన్ని ముద్దాడారు.

ఫైనల్ చేరిన అజేయ ప్రస్థానం
ఈ టోర్నీలో అంతకుముందు జరిగిన నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ భారత జోడీ ఏకపక్ష విజయాలతో దూసుకెళ్లింది. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో డెన్మార్క్‌ను 6-0తో, అమెరికాను 6-2తో, జర్మనీని 6-2తో వరుసగా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ప్రపంచకప్ ఆర్ఛరీ రికర్వ్ మిక్స్‌డ్ విభాగంలో భారత్ ఫైనల్ చేరి స్వర్ణం గెలవడం 2022 తర్వాత ఇదే తొలిసారి. గతంలో 2022లో అంటాల్యాలోనే జరిగిన టోర్నీలో రిధి, తరుణ్‌దీప్ రాయ్ జోడీ స్వర్ణం సాధించగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రికార్డు పునరావృతమైంది.
ఆర్మీ జవాన్ ధీరజ్, యంగ్ సెన్సేషన్ కుమ్‌కుమ్
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న భారత సైనిక ఉద్యోగి (ఆర్మీ జవాన్) ధీరజ్ బొమ్మదేవరకు ప్రపంచకప్ మిక్స్‌డ్ విభాగంలో ఇదే మొదటి స్వర్ణ పతకం. గతంలో ఆయన కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇక కేవలం 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేసిన కుమ్‌కుమ్ మొహోత్, గత నెలలో షాంఘైలో జరిగిన ప్రపంచకప్‌లోనూ భారత మహిళల జట్టు స్వర్ణం గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి పసిడితో మెరిసింది.
ధీరజ్‌కు మరో చారిత్రాత్మక అవకాశం
మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, ఈరోజే జరగనున్న పురుషుల వ్యక్తిగత (ఇండివిడ్యువల్) సెమీఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మోరిట్జ్ వైసర్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ధీరజ్ తన కెరీర్‌లోనే మొదటిసారి ప్రపంచకప్ వ్యక్తిగత ఫైనల్‌కు చేరుకుంటాడు. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో రెండు పతకాలు సాధించిన భారతీయ ఆర్చర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించే సువర్ణ అవకాశం ధీరజ్ ముందుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications