హైదరాబాద్: తోటి ఆర్చర్ వదిలిన బాణం ప్రమాదవశాత్తూ గొంతులో గుచ్చుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిందో క్రీడాకారిణి. కోల్‌కతాలోని బోల్పుర్లో ఉన్న స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోమవారం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా జ్వెయిల్ షేక్ సంధించిన బాణం 14 ఏళ్ల ఫాజిలా ఖతున్ అనే ఆర్చర్‌కు మెడ పక్క భాగంలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.
వైద్యులు బాణాన్ని ఖతున్ మెడ నుంచి తీసివేశారు. బాణం ఖతున్ మెడకు పక్క భాగంలో గుచ్చుకోవడంతో ఆమెకు పెను ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటనపై శాయ్ రీజినల్ డైరెక్టర్ ఎమ్ఎస్ గోయిండీ స్పందించారు.
'ప్రాక్టీస్ జరిగే సమయంలో ఒక రౌండ్లో బాణాలు వేసిన తర్వాత వాటిని తిరిగి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఎవరూ బాణాలు సంధించకూడదు. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన. కానీ తప్పు ఎలా జరిగిందో తెలియదు. ఈ విషయంపై విచారణ జరిపిస్తున్నాం' అని ఆయన అన్నారు.