
ఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండువారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు కొత్త మంత్రి వచ్చారు. ఇప్పటిదాకా కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించిన కిరణ్ రిజుజు స్థానంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణని బుధవారం చేపట్టగా.. గత రెండేళ్లుగా క్రీడల మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు న్యాయశాఖకి మారారు. దాంతో రిజిజు స్థానంలో క్రీడల మంత్రిగా అనురాగ్ ఠాకూర్‌కి అవకాశం లభించింది.
'చాలా సంతోషంగా ఉంది. క్రీడల మంత్రిగా దేశ ప్రజలకు సేవ చేయనుండడం గౌరవంగా భావిస్తున్నా. ఆటగాళ్లకు అండగా నిలబడతా. గతంలోని అనుభవం పనికొస్తుంది' అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్‌కు ఇదివరకే క్రీడలతో అనుబంధముంది. ఆయన గతంలో 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. ఠాకూర్‌కి బీసీసీఐ సెక్రటరీగా చాలా ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. అంతకంటే ముందు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేశారు.
జపాన్‌లో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ 2021 జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే అక్కడికి భారత క్రీడాకారులు వెళ్లనుండగా.. అత్యంత కీలక సమయంలో క్రీడల మంత్రిని మార్చడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత్ నుంచి విశ్వ క్రీడలకు 100పైగా అథెట్లు వెళ్లనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్ 2020ని.. జులైలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.
ఒలింపిక్స్‌ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాదికాలంగా జపాన్ ప్రభుత్వం కరోనా వైరస్ ఎమెర్జెన్సీ విధిస్తూ.. వ్యాప్తిని అడ్డుకుంది. అయితే ఒలింపిక్స్ సమీపించడంతో ఏర్పాట్లని వేగవంతం చేసేందుకు గత నెల 21న ఆ ఎమెర్జెన్సీని ఎత్తివేశారు. అప్పటి నుంచి మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో రోజుకి సగటున 920 కేసులు నమోదవుతున్నాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
ఒలింపిక్స్ ముంగిట ఉదాసీనంగా ఉంటే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావిస్తున్న జపాన్ అధికారులు.. మళ్లీ కరోనా ఎమెర్జెన్సీ విధించే దిశగా అడుగులు వేస్తోంది.