
హైదరాబాద్: దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతూనే ఉంది. శనివారం భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల డబుల్ ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని తన కెరీర్‌లోనే అత్యుత్తమ విజయాన్ని నమోదు చేశాడు.
రెండుసార్లు వరల్డ్ కప్ మెడల్ సాధించిన అంకుర్ 140/150 పాయింట్లు సాధించి, చరిత్ర సృష్టించాడు. షూటాఫ్‌లో 26 ఏళ్ల అంకుర్ 4-3 తో యియాంగ్ (చైనా)పై ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలిచాడు. హుబర్ట్ (స్లోవేకియా) కాంస్యం దక్కించుకున్నాడు.
ఇక, టీమ్ ఈవెంట్‌లో మాత్రం మహ్మద్ అసద్, శార్దూల్ విహాన్, అంకుర్ మిట్టల్‌తో కూడిన జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. 409 పాయింట్లు మాత్రమే సాధించి, కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 411 పాయింట్లు సాధించిన ఇటలీ జట్టు స్వర్ణం కైవసం చేసుకోగా, 410 పాయింట్ల స్కోర్ చేసిన చైనా జట్టుకు రజతం దక్కించుకుంది.
25మీ. పిస్టల్‌లో మను బాకర్ నిరాశపర్చింది. అర్హత రౌండ్లలో ఆమె పదో స్థానంలో నిలిచింది. 50 మీటర్ల రైఫిల్ క్వాలిఫైయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన అంజుమ్ మౌండ్గిల్ ఫైనల్ చేరలేకపోయింది. జూనియర్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన మనీషా, మానవాదిత్య జోడీ నాలుగో స్థానంతో పోటీని ముగించింది.
భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కారణంగా ఏడు రోజుల్లోనే 20 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్, రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఆతిథ్య దక్షిణ కొరియా ఉండగా, చైనాను అధిగమించి భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. వీటిలో 7 స్వర్ణాలు, 7 రజతాలు కాగా, ఆరు కాంస్యాలున్నాయి.
రల్డ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత షూటర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. స్వర్ణం సాధించిన అంకుర్ మిట్టల్‌ను, కాంస్యం సాధించిన భారత జట్టును కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ టిట్టర్ ద్వారా అభినందించారు.