ఉత్తరాఖండ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా 38వ జాతీయ క్రీడలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేషనల్ గేమ్స్ తెలుగు అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో వరుసగా పతకాలు వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యర్రాజి జ్యోతి హ్యాట్రిక్ స్వర్ణాన్ని అందుకుంది. వరుసగా మూడోసారి మహిళల 110 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ ను ముద్దాడింది. తాజా క్రీడల్లో జ్యోతి పరుగును 13.10 సెకన్లలో పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచింది. అంతకుముందు 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ ఈ విభాగంలోనే పసిడి పతకాలను సాధించింది జ్యోతి.
అతడు కూడా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్
పురుషుల విభాగంలో తేజస్ శిర్సే కూడా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 110 మీటర్ల హర్డిల్స్‌లో 13.65 సెకన్లలో పరుగులు ముగించి ఈ జాతీయ క్రీడల్లో వరుసగా మూడో సారి పసిడిని ముద్దాడాడు. అంతకుముందు 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ అతడు గోల్డ్ మెడల్స్ సాధించాడు. పురుషుల డెకథ్లాన్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహిత్ రోమన్ బ్రాంజ్ మెడల్ తో మెరిశాడు.

తెలంగాణ ఖాతాలో మరో రెండు..
తెలంగాణకు కూడా తాజాగా మరో రెండు కంచు పతకాలు ఖాతాలో వచ్చి చేరాయి. తెలంగాణ మహిళల నెట్ బాల్ టీమ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తెలంగాణ, ఉత్తరాఖండ్ జట్ల మధ్య మూడో స్థానం కోసం పోటీ జరగగా.. మ్యాచ్ 42-42తో టైగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు బ్రాంజ్ మెడల్ అందించారు.
మహిళల 4×100 మీటర్ల రిలేలో నిత్య గంధె, అగసర నందిని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నిత్య, నందిని, ఆకుమడుపుల మైథిలి, మాలోతు సింధుతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. 47.58 సెకన్లలో పరుగును ముగించి ఈ ఘనతను సాధించింది.