
హైదరాబాద్: అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని ఓల్గా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు, అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ హెచ్చరించారు.
జ్యోతి సురేఖ, ఆమె తండ్రి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో మంగళవారం ఆయన ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు సత్యనారాయణను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, వైద్యాన్ని నిరాకరించి ఆయన రెండో రోజు దీక్షను కొనసాగించారు. అకాడమీలోనే సత్యనారాయణ సతీమణి కృష్ణకుమారి సైతం రెండో రోజు దీక్షను కొనసాగిస్తున్నారు.
సత్యనారాయణ వైద్యానికి నిరాకరిస్తుండడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్టు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వెంకటకృష్ణ తెలిపారు. గురువారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి ఫ్లూయిడ్స్, సెలైన్లు ఎక్కిస్తామన్నారు.
అంతకుముందు:
జ్యోతి సురేఖకు ప్రకటించిన మొత్తంలో రూ.22 లక్షలు కోత విధించారని తెలిపింది. ఇప్పటి వరకూ తనకు కేటాయించిన మొత్తం ఇంకా అందలేదన్నారు. సీఎం ప్రకటించిన ప్రోత్సాహకంలో రూ.15 లక్షలను కోచ్ చెరుకూరి సత్యనారాయణకు కేటాయిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అధికారులు నిర్ణయం తీసుకున్నారని జ్యోతి తెలిపింది. కాగా చెరుకూరి సత్యనారాయణ అసలు తన కోచ్ కాదంటూ జ్యోతి సురేఖ చెబుతున్నారు. సీఎం ప్రోత్సహిస్తున్నా.. అధికారులు మాత్రం ఆడటనివ్వడం లేదని ఆమె తండ్రి వాపోయారు.
ఈ విషయమై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ.. జ్యోతి సురేఖకు న్యాయం చేసేలా చూస్తామన్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్న ఆయన ఈ వివాదం విషయమై మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ అధ్యక్షుడితో మాట్లాడానన్నారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తానని, తర్వాత తన దీక్ష విషయమై నిర్ణయం ప్రకటిస్తానని జ్యోతి సురేఖ చెప్పారు.