
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ ప్రపంచ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ప్రపంచ నెం.1 స్థానంతోనే పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి)కి చెందిన బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్‌లో అమిత్ అగ్ర స్థానానికి ఎగబాకాడు. నంబర్ వన్ ర్యాంకు పొందిన ఏకైక భారత ఒలింపిక్-బాక్సర్ కూడా ఇతడే. గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంగాల్ (52 కిలోలు) ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షాఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 2-3 తేడాతో ఓడిపోయాడు.
బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన తాజా లో పురుషుల ర్యాంకింగ్స్‌లో మనీష్ కౌశిక్ (63 కిలోలు) 18వ స్థానంలో, సతీష్ కుమార్ (75, 95 కిలోలు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ (69 కిలోలు) తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. సిమ్రాన్‌జిత్ కౌర్ (60 కిలోలు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 69 కిలోల విభాగంలో లోవ్లినా బోర్గోహైన్ ఐదో స్థానంలో ఉండగా.. 75 కిలోల విభాగంలో పూజా రాణి 8వ స్థానంలో ఉంది.
భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్.. టోక్యో ఒలింపిక్స్ 2021కు అర్హత సాధించాడు. అర్హత 'ఎ' ప్రమాణం అందుకుని ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా సాజన్ రికార్డు సృష్టించాడు. శనివారం ఇటలీలోని రోమ్‌లో సెట్ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించాడు. ఒలింపిక్ అర్హత మార్క్ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే అతడు లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ సాజన్ తిరగరాశాడు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాది వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇప్పటికే కొందరు అథ్లెట్లు ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నారు. ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇటువలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల ఉష్ణోగ్రత చూడటం తప్పనిసరి. మాస్కులు ధరించాలి. స్టేడియంలో మరో ప్రేక్షకుడిని కలవకూడదు. నిర్దేశించిన సీటులోనే కూర్చోవాలి. కేరింతలు కొట్టకూడదు. పోటీల తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి. క్రీడాకారుల్ని ఆటోగ్రాఫ్‌లు అడగడం, మద్దతు తెలపడం, మద్యపానం నిషేధం.