Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకాన్ని సాధించింది. 57 కేజీల పురుషుల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టాయ్ క్రూజ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యాన్ని సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన రెజ్లర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఈ బౌట్‌కు ముందు హైడ్రామా చోటు చేసుకుంది. బౌట్ ఆరంభం కావడానికి 12 గంటల ముందు అమన్ సెహ్రావత్.. శరీర బరువు 61.5 కేజీలు. అతను పోటీ పడాల్సింది 57 కేజీల కేటగిరీ కావడం.. నిర్దేశిత పరిమితి కంటే సరిగ్గా 4.5 కిలోల బరువు పెరగడం భారత క్యాంప్‌లో కలకలం రేపింది.

ఇదే కారణంతో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్.. అనర్హతకు గురైన విషయం తెలిసిందే. మహిళల 50 కేజీల కేటగిరీలో పోటీలో నిలిచిన వినేష్ ఫొగట్.. ఫైనల్స్‌కు ముందు 52 కేజీల బరువును నమోదు చేశారు. దీనితో ముందు రోజు రాత్రి కఠోరంగా శ్రమించి దాన్ని తగ్గించుకోగలిగారు గానీ.. 100 గ్రాముల అధికంగా ఉండటం అనర్హతకు దారి తీసింది.
సరిగ్గా అలాంటి పరిస్థితులే 57 కేజీల పురుషుల రెజ్లింగ్ విభాగంలో ఎదురయ్యాయి. బౌట్‌కు ముందు అమన్ సెహ్రావత్ 61.5 కేజీల బరువు తూగడం ఆందోళనకు గురి చేసింది. దీనితో శరీర బరువును తగ్గించుకోవడానికి కఠోరంగా శ్రమించాల్సి వచ్చింది. 10 గంటల వ్యవధిలో అతను 4.6 కిలోల బరువు తగ్గించుకోగలిగాడు.
అర్ధరాత్రి మ్యాట్ సెషన్‌తో అతని ఎక్సర్‌సైజ్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇద్దరు సీనియర్ కోచ్‌లు అతనిని స్టాండింగ్ రెజ్లింగ్‌లో నిమగ్నం అయ్యారు. 12:30 గంటలకు వారు జిమ్‌కు చేరుకున్న అమన్.. ట్రెడ్‌మిల్‌పై నాన్‌స్టాప్‌గా గంటపాటు పరుగులు తీశాడు. తరువాత అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నాడు.
శరీరంపై ఏర్పడిన చెమటను పొగొట్టుకోవడానికి అనంతరం అయిదు సెషన్ల పాటు స్టీమ్ బాత్ చేశాడు. ఒక్కో సెషన్ అయిదు నిమిషాల పాటు ఉంటుంది. చివరి సెషన్ ముగిసే సమయానికి అమన్ శరీర బరువు ఇంకా 900 గ్రాములు అధికంగా నమోదైంది. దీనితో అతనికి మసాజ్ చేయించారు. ఆ తరువాత 15 నిమిషాల పాటు జాగింగ్ చేశాడు.
తెల్లవారు జామున 4:30 గంటలకు అమన్ శరీర బరువు 56.9 కిలోలుగా తేలింది. అంటే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికం. బౌట్ ఆరంభం అయ్యే సమయానికి దాన్ని కూడా తగ్గించుకోగలిగాడు. రాత్రంతా నిద్రపోని అమన్‌కు నిమ్మరసం, తేనెతో కూడిన గోరువెచ్చని నీరు, కాఫీ ఇచ్చారు. ఆ తరువాత అమన్ నిద్రపోలేదు. మిగిలిన సమయం అంతా రెజ్లింగ్ బౌట్ వీడియోలను చూస్తూ గడిపాడు.