హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఇద్దరి ఫొటోలతో సీపీఐ(మావోయిస్టులు) విడుదల చేసిన కరపత్రాలు మార్చి 16వ తేదీన చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో కనిపించాయి.
నక్సల్ ఉద్యమం వారోత్సవాల్లో భాగంగా ఈ కరపత్రాలను మావోయిస్టులు పంచినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24వ తేదీన జరిగిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్‌లు సాయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సాయంపై మావోయిస్టులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అమరుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ రూ.9 లక్షలు సాయం చేయగా, సైనా నెహ్వాల్ రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది.
జవాన్లు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని, తీవ్రమైన మనోవేదనతో బాధపడుతున్న జవాన్ల కుటుంబాలకు తన వంతుగా ఆర్థికసాయం అందించానని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవలే కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షిని అక్షయ్ కుమార్ కలిశాడు. తాను చేసే సాయంతోపాటు సాధారణ పౌరులు కూడా సాయం చేసేలా ఓ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా అక్షయ్ సూచించాడు.