2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ ఆసక్తి ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన ఆసక్తిని తెలుపుతూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖను కూడా రాసింది. అయితే 2036 ఒలింపిక్ నిర్వహణ హక్కుల కోసం భారత్ మాత్రమే కాకుండా ఇండోనేసియా, మెక్సికో, పోలెండ్, తుర్కియే, దక్షిణ కొరియా, ఈజిప్ట్ కూడా పోటీ పడుతున్నాయి.
అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా
భారత్ చివరి సారిగా 2010లో (కామన్వెల్త్ క్రీడలు) బహుళ క్రీడల టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ సారి ఆసక్తి చూపినట్టుగానే, భారత్ బిడ్ గెలిస్తే, అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడలను నిర్వహించాలన్నది మనోళ్ల ఆలోచన. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈవెంట్లను నిర్వహించడానికి అవసరమైన అత్యాధునిక వసతులు అక్కడ ఉన్నాయట.

ఒక్క అహ్మదాబాద్‌లోనే కాదు దేశంలోని వివిధ నగరాల్లోనూ ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించాలని భావిస్తోంది భారత్. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి. పైగా ఖర్చును తగ్గించుకోవడం కోసం ఒలింపిక్స్ నిర్వహించే ఏ ఆతిథ్య దేశమైనా, ఈ విశ్వ క్రీడలను ఒకటి కన్నా ఎక్కువ నగరాల్లో నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ). 2014లోనే దీనికి ఆమోదం తెలిపింది.
ఆ నగరమే ప్రధాన కేంద్రంగా
మన దేశంలో ఉన్న క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే.. ఒకటి కన్నా ఎక్కువ నగరాల్లో నిర్వహించేందుకు భారత్ యోచిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ ప్రణాళిక అమలైతే, అహ్మదాబాద ప్రధాన కేంద్రంగానే ఆటలను నిర్వహిస్తారు. క్రీడా గ్రామాన్ని అక్కడే నిర్మిస్తారు.
ప్రణాళిక అమలైతే ఇలా
ఉదాహరణకు హాకీ కేంద్రంగా పేరున్న ఒడిశాలో అత్యధిక హాకీ మ్యాచ్‌లను ఆడించొచ్చు. రోయింగ్ ఈవెంట్లను భోపాల్‌లో, కనోయింగ్, కయాకింగ్‌లను పుణెలో నిర్వహించొచ్చు. ప్రస్తుతం క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్ వేదికలను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వశాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. క్రికెట్ టోర్నీ కోసం దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ పోటీ పడుతున్నాయి. ఇండోర్ ఈవెంట్లను అత్యధికంగా అహ్మదాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే అవకాశముందట.
కాగా, ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి సమగ్ర ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి సమర్పించనున్నారు మన అధికారులు. ఇక 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ఏంజిలెస్, 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.