
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియా గేమ్స్‌లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో షూటర్ రాహి సర్నోబాత్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తన తదుపరి లక్ష్యం 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని చెబుతోంది.
తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో సర్నోబాత్ మాట్లాడుతూ "ఇక సాధించాల్సింది ఒక్క ఒలింపిక్ స్వర్ణమే. నా తదుపరి లక్ష్యం 2020 ఒలింపిక్స్" అని చెప్పింది. "ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌కు వెళ్లాను. అది గతం. ఈసారి గురి తప్పను. పోడియం ఫినిషర్‌గా నిలుస్తా" అని రాహి సర్నోబాత్ ధీమా వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు భారత మహిళా షూటర్లు ఎవరూ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేదు. అయితే, తన ఒలింపిక్స్ కలను సాకారం చేసుకోవడానికి మానసిక, శారీరక శిక్షణపై దృష్టి సారించినట్లు సర్నోబాత్ తెలిపింది. "నన్ను నేను మెరుగుపర్చుకోడానికి చాలా కృషి చేయాల్సి ఉంది. ఒలింపిక్స్ అంత ఈజీ కాదు. అక్కడ వత్తిడిని తట్టుకోవాలంటే శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉండగలగాలి" అని తెలిపింది.
"ప్రస్తుతం భారత షూటర్లు సాంకేతికంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి, ఇప్పుడు మానసిక, శారీరక సామర్థ్యంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది" అని రాహి స్వర్ణోబాత్ వెల్లడించింది. అంతేకాదు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలంటే ఐదు అర్హతా రౌండ్లు ఎదుర్కోవాలి. అన్నీ ముఖ్యమే. అర్హత సాధించే కసితోనే షూటర్లంతా వస్తారు. కాబట్టి పోటీ చాలా కష్టంగా ఉంటుందని తెలిపింది.