వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆర్చరీలో భారత ఆర్చర్ అదితీ గోపీచంద్ స్వామి సంచలనం సృష్టించింది. అత్యంత చిన్న వయసులో వరల్డ్ చాంపియన్ టైటిల్ సొంతం చేసుకున్న తొలి ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం నాడు జరిగిన పోటీల్లో భారత ఆర్చర్లు వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలతో ఆకట్టుకున్నారు.
ఈ పోటీల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కూడా కాంస్యంతో రాణించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 17 ఏళ్ల అదితి విజేతగా నిలిచింది. అదే పురుషుల విభాగంలో 21 ఏళ్ల ఓజాస్ ప్రవీణ్ నెగ్గాడు. వీళ్లిద్దరూ కొత్త వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు. అంతకుముందు శుక్రవారం నాడు ముగిసిన టీమ్ ఈవెంట్లలో కూడా భారత క్రీడాకారులు రాణించారు.

తెలుగు క్రీడాకారిణి జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ కౌర్ బృందం వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించారు. ఇంతకుముందు జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా అదితి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె సీనియర్ కేటగిరీలో కూడా టైటిల్ నెగ్గడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆమె ఒకేసారి రెండు టైటిల్స్‌తో డబుల్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచినట్లు అయింది. ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆరో సీడ్ అదితి 149-147 స్కోరుతో మెక్సికో ఆర్చర్ ఆండ్రియా బెకెర్రానోను ఓడించింది. దీంతో పసిడి ఆమె సొంతమైంది.
అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌కే చెందిన రెండో సీడ్ జ్యోతి సురేఖను కూడా అదితి ఓడించింది. సురేఖపై 149-145 స్కోరుతో గెలిచింది. దీంతో కాంస్య పతకం కోసం సురేఖ పోటీ పడింది. ఈ పోటీలో 150కి 150 పాయింట్లు సాధించిన ఆమె.. మూడో స్థానంలో నిలిచి కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో సురేఖకు ఇది మూడో పతకం కావడం గమనార్హం.
అంతకుముందు 2019లో కూడా హె కాంస్యం సాధించింది. ఆ తర్వాత 2021లో రెండో స్థానంలో నిలిచి రజతం తన ఖాతాలో వేసుకుంది. పురుషుల ఫైనల్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగింది. ఈ మ్యాచ్‌లో ప్రవీణ్ 149 పాయింట్లు సాధించి, నెదర్లాండ్స్ ఆర్చర్ స్కోసెర్ మైక్‌ను ఓడించాడు. దీంతో అతనికి వరల్డ్ టైటిల్ దక్కింది. ఈసారి టోర్నీలో మొత్తం మూడు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన భారత్‌కు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.