
లైఫ్‌లో పది రౌండ్ల షాట్లే అత్యుత్తం
పతకం ముఖ్యం కాదు.. ఇన్నేళ్ల నా ప్రయాణం, పతకం కోసం పడిన శ్రమ నాకు గర్వకారణమని ఆయన చెప్పారు. బీజింగ్ ఫైనల్ నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ.. ‘పతకం సాధించే ప్రదర్శన చేశానని నాకు తెలుసు. ఈవెంట్ తర్వాత కోచ్ గ్యాబీ దగ్గరకెళ్లి హత్తుకున్నాను. ఆమె చెప్పడంతోనే స్వర్ణం సాధించానని తెలిసింది. ఒలింపిక్స్ ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడి మధ్య కెరీర్లోనే అత్యుత్తమ షూటింగ్ ప్రదర్శన కనబరిచాను. అంతటి ఒత్తిని నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా లైఫ్‌లో ఆ పది రౌండ్ల షాట్లే అత్యుత్తం' అని బింద్రా చెప్పాడు.

షూటింగ్ ప్రాక్టీస్ చేయడం తేలికైంది
అభినవ్ బింద్రా కోసం ఆయన తండ్రి అప్జిత్ బింద్రా ఇండోర్ పర్సనల్ షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల బింద్రాకు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం తేలికైంది. ‘సొంతంగా షూటింగ్ రేంజ్ ఉండటం లగ్జరీ కాదు, అది అవసరం. దాని వల్ల షూటింగ్ ప్రాక్టీస్ కోసం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు, ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేయొచ్చ'ని బింద్రా తండ్రి తెలిపారు.

కెరీర్ మొదలుపెట్టే సమయానికి చూపు సమస్యగా
1998లో 15వ ఏటే అభినవ్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నారు. తద్వారా ఈ క్రీడల్లో పాల్గొన్న పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. షూటర్‌గా కెరీర్ మొదలుపెట్టే సమయానికి బింద్రాకు కంటి చూపు సమస్యగా ఉండేది. తర్వాత సైట్ మరింత పెరిగింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 2006లో తీవ్రమైన స్పైనల్ ఇంజ్యూరీ కారణంగా దోహాలో జరిగిన ఆసియా క్రీడల నుంచి బింద్రా తప్పుకున్నాడు. గాయం వల్ల అతడి కెరీర్ ప్రమాదంలో పడినప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో మళ్లీ షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని ఆయన వ్యక్తిగత ఫిజియోథెరిపిస్ట్ దిగ్‌పాల్ సింగ్ చెప్పారు.

2008 తర్వాత జీవితంలో భారీ శూన్యం:
‘ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలనే లక్ష్యంతో 15 ఏళ్ల పాటు క్రమంగా నిద్ర లేచేవాణ్ని. చివరికి 2008లో అది సాధ్యమైంది. కానీ పసిడి పతకం సాధించాక ఏం చేయాలో తెలియలేదు. 2008 తర్వాత నా జీవితంలో భారీ శూన్యం ఏర్పడింది' అని బింద్రా చెప్పాడు. ప్రొఫెషనల్ షూటింగ్ నుంచి తప్పుకున్న బింద్రా.. ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గినప్పుడు పొందిన థ్రిల్‌ను నా జీవితంలో మరే సందర్భంతోనూ పోల్చలేమని, అదెంతో ప్రత్యేకమని చెప్పాడు. అన్నట్టు ఈ అక్టోబర్లో అభినవ్ బింద్రా బయోపిక్ పట్టాలెక్కబోతుంది.


Click it and Unblock the Notifications












