
హైదరాబాద్: బీజింగ్ ఒలింపిక్స్ 2008 స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన సాధించిన పలు గౌరవ పురస్కారాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం రెండు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించింది. షూటింగ్ విభాగంలో జాతీయ పరిశీలకుడిగా, టార్గెట్ ఒలింపిక్ పోడియం కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది.
ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఈ రెండు పదవులకూ రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. రాజీనామా లేఖను కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్‌కు పంపించారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను బింద్రా అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
'కొన్ని ప్రైవేటు ప్రాజెక్టుల బాధ్యతలు నిర్వహించేందుకుగాను ఈ రెండు పదవులకు రాజీనామా చేస్తున్నాను. ఇందులో అభినవ్ బింద్రా టార్గెట్ ఫెర్ఫామెన్స్ సెంటర్ కూడా ఉంది. భవిష్యత్తులో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నాను. ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో అథ్లెట్లు వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఛైర్మన్‌గా, పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అథ్లెట్లకు న్యాయం చేయలేకపోతున్నాను. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేయాలనుకుంటున్నాను' అని పేర్కొన్నారు.
ఇటువంటి పదవుల్లోనే పరిశీలకులుగా ఉన్న బాక్సర్ మేరీ కోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ మేరీ కోమ్ బాక్సింగ్ క్రీడాకారిణిగా కెరీర్‌ను కొనసాగిస్తుంది. సుశీల్ కుమార్ సైతం అదే పంథాను కొనసాగిస్తున్నారు.
2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా స్వర్ణ పతకం సాధించారు. 2006లో ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ మరో పసిడిని దక్కించుకున్నారు. 2016 సెప్టెంబరు 5న బింద్రా తన షూటింగ్ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.