
హైదరాబాద్: భారత షూటర్ అభినవ్ బింద్రాకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఒలింపిక్స్‌లో ఇప్పటికీ భారత్‌కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం అందించిన ఏకైక క్రీడాకారుడిగా అభినవ్ బింద్రా కొనసాగుతున్నాడు. అయితే, తాజాగా బింద్రాకు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అత్యున్నత 'బ్లూ క్రాస్' అవార్డ్ లభించింది.
అంతర్జాతీయ షూటింగ్‌లో 'బ్లూ క్రాస్' అత్యున్నత పురస్కారంకాగా, భారత్‌లో ఈ అవార్డు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా అభినవ్ బింద్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ షూటింగ్‌లో అభినవ్ బింద్రా అత్యుత్తమ కృషికిగాను ఈ అవార్డుని ప్రదానం చేసినట్లు ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రకటించింది.
ఈ సందర్భంగా అభినవ్ బింద్రా మాట్లాడుతూ 'ఐఎస్‌ఎస్‌ఎఫ్ అత్యున్నత ''బ్లూ క్రాస్'' పురస్కారం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. అథ్లెట్స్ కోసం ఐఎస్‌ఎస్‌ఎఫ్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా' సంతోషం వ్యక్తం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
2006లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. వీటితో పాటు బింద్రా ఖాతాలో ఏడు కామన్వెల్త్ మెడల్స్‌తో పాటు... మూడు ఆసియా గేమ్స్ మెడల్స్ కూడా ఉన్నాయి. బింద్రా ప్రతిభని గుర్తించిన భారత ప్రభుత్వం 2000లో అర్జున అవార్డ్, 2001లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, 2009లో పద్మభూషణ్ అవార్డ్స్‌ని ప్రదానం చేసింది.