బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ బుధవారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విన్యాసంతో ఓ షాట్ కొట్టాడు. ఆ షాట్ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. కిందపడుతూ అతని బంతిని ఫోర్‌గా మలిచిన తీరు అత్యద్భుతం.
వికెట్‌కు అటు ఇటు బ్యాట్స్‌మెన్ రకరకాల స్వీప్‌లు చేస్తుంటారు. స్కూప్ షాట్లు కూడా చూశాం. ప్రతి షాట్‌కు ఓ పేరుంది. కానీ డివిల్లియర్స్ ఆడిన షాట్ అద్భుతం. అనురీత్ బౌలింగులో డివిల్లియర్స్ బౌండరీ బాదాడు.
రివర్స్ స్కూప్ ఆడటంలో డివిల్లియర్స్ దిట్ట. 16వ ఓవర్లో అనురీత్ బంతి వేసేందుకు ముందు ఆ షాట్‌కు డివిల్లియర్స్ తయారయ్యాడు. కానీ బంతి అంచనాలకు భిన్నంగా వచ్చింది. ఎక్కువ ఎత్తులో లెగ్ సైడ్ ఫుల్ టాస్ పడింది. దీనిని ఏబీ డివిల్లియర్స్ వదల్లేదు. అతను కిందికి పడిపోతూ కూడా బంతికి బ్యాట్‌ను తాకించాడు. బంతి థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి దూసుకెళ్లింది. షాట్ ఆడాక తనను తాను అదుపు చేసుకోలేక కిందపడ్డాడు.

కాగా, క్రిస్ గేల్ రెచ్చిపోయి 57 బంతుల్లో సెంచరీ (117 పరుగులు) చేయడం, డివిల్లియర్స్ కూడా ఊచకోత కోయడంతో (24 బంతుల్లో 47 పరుగులు) పంజాబ్ 138 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
ఇది ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద ఓటమి. అతిపెద్ద ఓటమి రికార్డ్ బెంగళూరు పేరిట ఉంది. ఆ జట్టు 2008లో కోల్‌కతా చేతిలో 140 పరుగుల తేడాతో ఓడింది. కాగా, ఈ మ్యాచ్‌లో గేల్‌కు రెండుసార్లు లైఫ్ దొరికింది. మూడో ఓవర్లో బెయిలీ, తొమ్మిదో ఓవర్లో వోహ్రా క్యాచ్‌లు వదిలేశారు.