హైదరాబాద్: విజయవాడకు చెందిన ఐదేళ్ల చెరుకూరి డాలీ శివాని అనే చిన్నారి అద్బుత ప్రదర్శన చేసి అరుదైన రికార్డుని సృష్టించింది. ఆర్చరీలో శివాని కేవలం 11 నిమిషాల 19 సెకన్లలో 103 బాణాలు సంధించి తన పేరిట అరుదైన రికార్డుని నెలకొల్పింది.
10 మీటర్ల దూరం నుంచి ఈ ఫీట్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటుగా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కింది. దీంతో పాటు శివాని 20 మీటర్ల దూరం నుంచి 5 నిమిషాల 8 సెకన్లలో 36 బాణాలు సంధించి.. 360 పాయింట్లకు 290 పాయింట్లు సాధించి రెండో ఫీట్‌కు కూడా ప్రయత్నిం చేసింది.

శివాని మరెవరో కాదు అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుడైన చెరుకూరి లెనిన్‌కు స్వయాన సోదరి. శివాని మూడేళ్ల వయసు నుంచే ఆర్చరీపై మక్కువ పెంచుకుని తన ప్రతిభను చాటుతోంది. కాగా, శివాని తండ్రి సత్యనారాయణ ఓల్గా ఆర్చరీ అకాడమీ ఛైర్మన్. కూతురు అరుదైన రికార్డు సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
శివాని భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న చెరుకూరి లెనిన్-ఓల్గా మెమోరియల్ టోర్నమెంట్ అండర్-9, అండర్-14 పోటీలపై ప్రస్తుతం శివాని దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు.

కాగా, చాందిని సోదరుడు లెనిన్ 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత సరోగసీ ద్వారా సత్యనారాయణ దంపతులు శివానికి జన్మనిచ్చారు.