మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా.. మారుమూల గ్రామాల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చే ధ్యేయంగా ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రీడలను ప్రారంభించారు. దీంతో పాటే 2022 గుజరాత్, 2023 గోవా క్రీడలను కూడా ఆయన ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి ఈ వేడుకలో మెదీ పాల్గొన్నారు. గోల్ఫ్ కార్ట్‌లో తిరుగుతూ క్రీడాకారులకు అభివాదం చేశారు. ఈ ప్రారంభ వేడుకల్లో తెలంగాణ బృందానికి ఆర్చర్ చికిత, ఆంధ్రప్రదేశ్ బృందానికి షూటర్ మద్దినేని ఉమామహేష్ ఫ్లాగ్ బేరియర్స్ గా పతాకధారులుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ధార్మిక వారసత్వాన్ని, జీవ వైవిధ్యాన్ని ఈ ప్రారంభోత్సవ వేడుకలో చూపించడం అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. 2036 ఒలింపిక్స్ గురించి కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు . "2036 ఒలింపిక్స్ హోస్టింగ్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించినా అక్కడ అన్ని రంగాలు లాభపడతాయి. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు దక్కుతాయి. అందుకే ఒలింపిక్స్ ను ఇక్కడ నిర్వహిస్తే భారతలోని క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది." అని పేర్కొన్నారు.

మొత్తం 18 రోజుల పాటు ఈ జాతీయ క్రీడలు జరగనున్నాయి. వచ్చే నెల 14తో ముగియనున్న ఈ క్రీడా టోర్నీలో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాలు ఈ మెగా క్రీడలకు ఆతిథ్యమిస్తున్నాయి. సుమారు 10,000 మంది క్రీడాకారులు బరిలో దిగుతున్నారు.