భారత క్రీడారంగంలో డోపింగ్ కలకలం.. పట్టుబడ్డ 22 మంది రోయర్లు!!

న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో డోపింగ్ కలకలం రేపింది. ఒకే క్రీడకు చెందిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో డోపీలుగా తేలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 22 మంది జాతీయ క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారు. జూనియర్ స్థాయిలోని జాతీయ పురుషులు, మహిళల రోయర్లు డోప్ టెస్టులో విఫలమైనట్టు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించింది.
డోపింగ్‌లో పట్టుబడ్డ వారంతా మైనర్లు కావడం విశేషం. 16 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వీరంతా ఒకే నిషేధిత డ్రగ్ వాడినట్టు రుజువైంది. వీరిలో చాలా మంది 'ఖేలో ఇండియా' గేమ్స్‌లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. పోటీలు లేని సమయంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీరి నుంచి సేకరించిన నమూనాల్లో అంతా ఒకే రకమైన నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే అందరూ మైనర్లు కావడంతో నిబంధనల ప్రకారం రోయర్ల పేర్లు వెల్లడించడం లేదు.
గతేడాది డిసెంబరులో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా జూనియర్ రోయింగ్ పోటీలకు ముందు భారత జట్లకు హైదరాబాద్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా రోయర్లకు నిర్వహించిన డోప్ పరీక్షల్లో.. అందరి యూరిన్ శాంపిల్స్‌లోనూ ప్రోబ్‌నెసిడ్ అనే ఉత్ర్పేరకం తీసుకున్నట్టు తాజాగా బయటపడింది. శిబిరంలో పాల్గొన్న 24 మందిలో 20 మంది పట్టాయా టోర్నీకి వెళ్లి పతకాలు సాధించారు. రోయర్ల 'బి' శాంపిల్స్ కూడా పాజిటివ్‌గా తేలితే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
డోపీలుగా పట్టుబడ్డ రోయర్ల అందరి శాంపిల్స్‌లో ఒకేరకమైన డ్రగ్ ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. వాళ్లు తీసుకున్న ఆహార పదార్థాల్లో ఈ డ్రగ్ కలిసి ఉండొచ్చన్న సందేహాలను భారత రోయింగ్ సమాఖ్య (ఆర్‌ఎఫ్‌ఐ) కార్యదర్శి ఎమ్‌వీ శ్రీరామ్ వ్యక్తం చేశాడు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజాలు రాబడతామని శ్రీరామ్ అన్నాడు. అయితే 2005లో 'నాడా' మొదలయ్యాక ఇలా ఒకే ఆటకు చెందిన ఇంత మంది పట్టుబడటం ఇదే తొలిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications