
టోక్యో: వచ్చే ఏడాది జరుగాల్సిన ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే మళ్లీ వాయిదా వేయబోమని, ఇక రద్దు చేసేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నవేళ ఈ ఏడాది జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్ గేమ్స్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులన్నీ చక్కబడితే 2021 జులై 23 నుంచి విశ్వక్రీడలను జరుపుతామని థామస్ బాచ్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే టోక్యో విశ్వక్రీడలకు 2021 చివరి ఆప్షన్ అని గురువారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్ బాచ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ మహమ్మారి వల్ల 2021 జూలైకి వచ్చే ఏడాది వాయిదా పడింది. అయితే వైరస్ ప్రభావం ఇలాగే ఉంటే.. వచ్చే ఏడాది సైతం విశ్వక్రీడలు జరుగడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని బాచ్ తేల్చిచెప్పారు.
థామస్ బాచ్ మాట్లాడుతూ... 'ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వక్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న జపాన్ తరఫు నుంచి కూడా ఆలోచిస్తున్నాం. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే.. అన్ని రోజులూ సుమారు మూడువేల నుంచి ఐదువేల వరకు ఉండే సిబ్బంది జీతభత్యాలు భరించడం, క్రీడలను రీషెడ్యూల్ చేయడం అనేది అతి పెద్ద సమస్య. సూటిగా చెప్పాలంటే.. ఒలింపిక్స్ నిర్వహక కమిటీ కోసం అంత మంది ఉద్యోగులను జపాన్ ఉంచుకోలేదు' అని అన్నారు.
'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడల షెడ్యూల్‌ను ప్రతీ ఏడాది మార్చలేం. క్రీడకారుల ఫిట్‌నెస్‌పై కూడా ప్రభావం ఉంటుంది. అథ్లెట్లను అనిశ్చితికి గురి చేయలేం. ఒలింపిక్స్ క్రీడలను మాటిమాటికీ వాయిదా వేయలేం. వచ్చే ఏడాదికి కరోనా వైరస్ ప్రభావం తగ్గకుంటే ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సి రావొచ్చు' అని థామస్ బాచ్ తెలిపారు. ప్రపంచ యుద్ధాలు జరిగినపుడు కూడా క్రీడలను వాయిదా వేయలేదన్నారు. మరోవైపు జపాన్‌ప్రభుత్వం ఒలింపిక్‌గేమ్స్‌ను మరోసారి వాయిదావేసే ఆలోచననకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.