
పీవీ సింధు
ఈ ఏడాది పీవీ సింధు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందన్న క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఈసారి కూడా కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాలను స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తలకిందులు చేస్తే వందకోట్ల మంది భారతీయుల ఆకాంక్షను పీవీ సింధు నెరవేర్చింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. రియో తర్వాత కూడా అదే ఫామ్‌ను కొనసాగించిన సింధు చైనా ఓపెన్ విజయంతో కెరీర్‌లో తొలిసారి సూపర్‌సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది. హాంకాంగ్‌లో రన్నరప్‌తో సంతృప్తిపడినా, సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోనూ సత్తా చాటి సెమీఫైనల్ వరకు చేరింది.

దీపా కర్మాకర్
యో ఒలింపిక్స్‌లో పోల్‌వాల్ట్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా దీపా కర్మాకర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. భారత జిమ్నాస్టిక్స్‌లో 52 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే దీపా కర్మాకర్ అద్భుత విన్యాసాలను కనబర్చింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో 15.006 పాయింట్లు సాధించి 0.15 తేడాతో తృటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. దీంతో రియోలో పతకం తేలేకపోయినా.. భారత అభిమానుల గుండెల్లో మాత్రం చెరుగని ముద్ర వేసింది. రియో ప్రదర్శనతో రాత్రికి రాత్రే ఇటు దేశంలో, అటు అంతర్జాతీయ స్థాయిలో దీపా పేరు మార్మోగిపోయింది.

టెన్నిస్‌లో సానియా మిర్జా వెలుగు
భారత టెన్నిస్‌లో ఈ ఏడాది సానియా మిర్జా అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. వయసు 30కి చేరినా తన రాకెట్ పదును మాత్రం తగ్గలేదని నిరూపించింది. మార్టినా హింగిస్‌తో కలిసి డబుల్స్‌లో 41 విజయాలను నమోదుచేసింది. దీంతో మహిళల డబుల్స్ చరిత్రలో ఇది మూడో అత్యధిక విజయాలుగా రికార్డులకెక్కాయి. ఇక డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు వరుసగా 84 వారాల పాటు టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఘనతను సానియా సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఈ రెండు అత్యంత మధురమైన ఘట్టాలుగా నిలిచిపోయాయి. ఈ సీజన్‌లో యూఎస్ ఓపెన్‌కు ముందు హింగిస్‌తో విడిపోయిన సానియా బార్బరా స్ట్రికోవాతో జత కట్టిన తర్వాత మరో మూడు టోర్నీలను గెలుచుకుంది.

సాక్షి మాలిక్
హర్యానాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గింది. దీంతో కుస్తీలో పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజర్ల్‌గా చరిత్ర సృష్టించింది. ఇక మొత్తంగా భారత్ తరఫున పతకం గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా రికార్డుల్లో చోటు సంపాదించింది. 12 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ పాఠాలు నేర్చుకున్న సాక్షి మాలిక్ 2014 గ్లాస్గో కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో కూడా కాంస్య పతకాలను సాధించింది.

అదితి అశోక్
రియో ఒలింపిక్స్‌కు ముందు అదితి అశోక్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. జనవరిలో ప్రొఫెషనల్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన ఆమె అనతికాలంలోనే భారత గోల్ఫ్‌కు ఓ చుక్కానిలా ఎదిగింది. ఒలింపిక్స్ 14వ రోజు రియోలో బరిలోకి దిగిన గోల్ఫర్లలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కిన ఈ బెంగళూరు అమ్మాయి ఒలింపిక్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ తర్వాత జరిగిన ఉమెన్స్ యూరోపియన్ టూర్‌లో భాగంగా ఇండియన్ ఓపెన్, ఖతార్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. వారం వ్యవధిలోనే ర్యాంక్‌ను 66 స్థానాలు మెరుగుపర్చుకుంది. ఐదేళ్ల వయసులో గోల్ఫ్‌లోకి ప్రవేశించిన ఆదితి కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగి జూనియర్ స్థాయిలోనే చాలా టైటిల్స్‌ను గెలుచుకుంది.


Click it and Unblock the Notifications











