మెల్బోర్న్: ఫిలిప్ హ్యూస్ విషాదకరమైన మరణంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్‌లో ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ టెస్టు మ్యాచ్ జరిగే తేదీని తర్వాత ప్రకటిస్తారు. నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడడానికి భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది.
ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపం ప్రకటించడానికి వీలుగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ గురువారం ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు మ్యాచును వాయిదా వేస్తున్నట్లు, అయితే అది ఎప్పుడు జరిగేది ఇప్పుడే చెప్పలేమని సిఎ వెబ్‌సైట్‌లో శనివారం ఓ ప్రకటన కనిపించింది.

బ్రిస్బేన్, సిడ్నీకి మధ్యలో గల మ్యాక్స్‌విల్లేలో హ్యూస్ అంత్యక్రియలు డిసెంబర్ 3వ తేదీ బుధవారం జరుగతాయి. ఈ స్థితిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం సాధ్యం కాదని, అలా నిర్వహించడం కూడా సరి కాదని సిఎ అభిప్రాయపడింది.
ఇవి అసాధారణమైన పరిస్థితులని, అంత్యక్రియలు జరిగిన మర్నాడే తమ ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ ఆడడానికి సిద్ధపడతారని, సిద్ధపడాలని ఆశించలేమని సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సూదర్లాండ్ అన్నారు. వారి క్షేమం తమకు ప్రథమ ప్రాధాన్యమని, వారు విలపిస్తున్నారని, ఈ తీవ్రమైన ఒత్తిడిలో వారు మ్యాచ్ ఆడగలరని ఆశించలేమని ఆయన అన్నారు.
తమ పరిస్థితిని అర్థం చేసుకుని, మద్దతు ఇస్తున్నందుకు ఆయన బిసిసిఐకి కృతజ్ఞతలు తెలిపారు. సహనం వహించాలని తాము క్రికెట్ కమ్యూనిటీని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిలిప్ హ్యూస్ చదువుకున్న మాక్స్‌విల్లే ఉన్నత పాఠశాల క్రీడా గదిలో అంత్యక్రియలు జరుగుతాయి.