
న్యూ ఢిల్లీ: మునుపెన్నడూ లేనంతగా అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఫిన్‌లాండ్ వేదికగా యువ అథ్లెట్ హిమదాస్ స్వర్ణ పతక ప్రదర్శన మరిచిపోకముందే సైక్లిస్ట్ ఎసో అల్బెన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఏజైల్(స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో అల్బెన్ రజత పతకంతో మెరిశాడు.
సైక్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారునిగా అల్బెన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పురుషుల కైరీన్ ఈవెంట్‌లో అండమాన్-నికోబార్ దీవులకు చెందిన ఈ 17 ఏళ్ల సైకిలిస్ట్ 0.017 సెకన్ల తేడాతో జాకబ్ స్టాన్‌స్టీ(చెక్ రిపబ్లిక్)కి స్వర్ణం చేజార్చుకున్నాడు. అండ్రె చుగావె(కజకిస్థాన్)కు కాంస్య పతకం దక్కింది.
ఈ విజయంపై అల్బెన్ స్పందిస్తూ ఇలా మాట్లాడాడు. 'పసిడి చేజార్చుకున్నందుకు ఒకింత అసంతృప్తితో ఉన్నా..మిగతా రేసర్లతో క్రాష్ కాకుండా ఉండేందుకు దూకుడు ప్రదర్శించాను. కచ్చితంగా పతకం గెలుస్తానన్న నమ్మకంతోనే బరిలోకి దిగాను. రజతం గెలువడం సంతోషంగా ఉంది అని అన్నాడు. మరోవైపు పురుషుల టీమ్ స్ప్రింట్ ఈవెంటులో ఎసో అల్బెన్, మయూర్ పవార్, జేమ్స్ కేథిల్‌క్పామ్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.'
'రజత పతకంతో రికార్డుల్లోకెక్కిన ఎసో విజయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాథోడ్ ట్విటర్‌లో స్పందిస్తూ వెల్‌డన్ ఎసో! అద్భుతమైన ప్రదర్శన. మరిన్ని పతకాలు త్వరలో రాబోతున్నాయంటూ ట్వీట్ చేశారు. మంత్రితో పాటుగా మరింతమంది నెటిజన్లు ఈ విజయంపై ట్వీట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.