ప్రో కబడ్డీ లీగ్ సీజన్-10లో మ్యాచ్ లు హోరాహొరీగా సాగుతున్నాయి. బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన రెండు మ్యాచ్ లు ఉత్కంఠగా సాగాయి. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో జైపుర్ పింక్ పాంథర్స్ విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ సీజన్ లో జైపుర్ కు ఇదే తొలి గెలుపు.
మ్యాచ్ ఆరంభమైన తర్వాత విరామం వరకు గుజరాత్ జెయింట్స్ పైచేయి సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 20-12తో గుజరాత్ ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండ్ హాఫ్ లో జైపుర్ అదరగొట్టింది. ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తాకొట్టిస్తూ వరుస పాయింట్లతో దూసుకెళ్లారు.

ఆఖరికి 35-32తో గుజరాత్ పై జైపుర్ విజయం సాధించింది. విజయంలో రైడర్ అర్జున్ కీలక పాత్ర పోషించాడు. అతడు 15 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జట్టులో సోను (13) రాణించాడు.
మరో మ్యాచ్ లో యూపీ యోథాస్ పై బెంగళూరు బుల్స్ 38-36 తేడాతో విజయాన్ని అందుకుంది. రైడర్లు వికాస్ (11), భరత్ (11) సూపర్-10తో సత్తాచాటారు. యూపీ జట్టులో ప్రదీప్ నర్వాల్ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 8 పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆది నుంచే యూపీపై బెంగళూరు పైచేయి సాధిస్తూ బ్రేక్ సమయానికి 21-13తో నిలిచింది. సెకండ్ హాఫ్ లో యూపీ గొప్పగా పోరాడినప్పటికీ ఓటమి చవిచూసింది. ఇవాళ మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి.