ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్టేడియంలో శనివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38-35తో గెలిచింది. ఈ సీజన్‌లో బెంగళూరుపై తెలుగు టైటాన్స్ నెగ్గడం రెండోసారి. బెంగళూరుపై విజయంతోనే టైటాన్స్ పాయింట్ల ఖాతా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ దూకుడుగా పాయింట్లను సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 23-12తో భారీ ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరును ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్‌లో టైటాన్స్ తడబడింది. ప్రత్యర్థి చేతిలో రెండు సార్లు ఆలౌటైంది. కానీ అంతిమంగా ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మూడు పాయింట్లో విజయం సాధించింది.

తెలుగు టైటాన్స్ విజయంలో కెప్టెన్ పవన్ షెహ్రావత్ 14 పాయింట్లో కీలక పాత్ర పోషించాడు. ఆశిష్ నర్వాల్ ఆరు, అజిత్ పవార్ అయిదు పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ జట్టులో అజింక్య పవార్, పంకజ్ చెరో తొమ్మిది పాయింట్లు, నితీన్ ఏడు పాయింట్లతో పోరాడారు. కాగా, శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై పట్నా పైరేట్స్ 42-37తో గెలిచింది.
తొలి అర్ధభాగంలో పట్నా పైరేట్స్ 23-19తో పైచేయి సాధించింది. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ హోరాహొరీగా సాగింది. పట్నాను యూపీ ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే పట్నా పైరేట్స్ పుంజుకుని అంతిమంగా విజయం సాధించింది. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ 11 పాయింట్లు, అయన్ 9 పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ టీమ్‌లో గగన్ గౌడ 9, భరత్ 6 పాయింట్లతో పోరాడారు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు బెంగాల్ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్, రాత్రి 9 గంటలకు పుణెరి పల్టాన్‌తో యు ముంబా తలపడనుంది.