ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11 ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠ పోరులో హర్యానా స్టీలర్స్‌పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్యానాను 40-38తో బెంగాల్ ఓడించింది. వరుసగా తమ చివరి రెండు మ్యాచ్‌లను టైగా ముగించిన బెంగాల్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదుచేసింది. మరోవైపు హర్యానా స్టీలర్స్‌కు ఇది రెండో పరాజయం.
తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోరాడాయి. హర్యానా ఒక్కసారి ఆలౌటైనప్పటికీ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్ల స్కోరు 19-19తో సమంగా ఉన్నాయి. రెండో అర్ధభాగంలో బెంగాల్‌ను హర్యానా ఆలౌట్ చేసింది. రైడింగ్‌లో విజృంభించింది. కానీ బెంగాల్ గొప్పగా పుంజుకుని అంతిమంగా రెండు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను గెలిచింది.

బెంగాల్ జట్టులో మనీందర్ సింగ్ 12 పాయింట్లతో సత్తాచాటాడు. హర్యానా స్టీలర్స్‌లో వినయ్ 10, మహ్మద్‌రీజా 9 పాయింట్లతో రాణించారు. గచ్చిబౌలి స్టేడియంలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబాపై పుణెరి పల్టాన్ 35-28తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో తమ అగ్రస్థానాన్ని పుణెరి మరింత పదిలం చేసుకుంది. తొలి అర్ధభాగం నుంచి పుణెరిది పైచేయి.
ఫస్టాఫ్ ముగిసేసరికి యు ముంబాను ఒక్కసారి ఆలౌట్ చేసి 22-16తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరును రెండో అర్ధభాగంలో ప్రదర్శించి మ్యాచ్‌ను నెగ్గింది. కెప్టెన్ అస్లామ్ 10, రైడర్ మోహిత్ 9 , ఢిపెండర్ 7 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. యు ముంబాలో రైడర్ అజిత్ (9) టాప్ స్కోరర్. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్‌తో గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనుంది.