ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 42-30 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో టాప్-4లోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ ఆది నుంచే తమిళ్ తలైవాస్‌పై గుజరాత్ జెయింట్స్ ఆధిపత్యం చెలాయించింది. ఒక్క సారి ఆలౌట్ చేసింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 18-13 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్, ట్యాకిల్ పాయింట్లతో సత్తాచాటింది. రెండో అర్ధభాగంలోనూ గుజరాత్ అదే జోరును కొనసాగించింది.

అయితే తలైవాస్ ప్రతిఘటించి ప్రత్యర్థిని కూడా ఒక్కసారి ఆలౌట్ చేసింది. కానీ తమ జట్టు కూడా మరోసారి కుప్పకూలడంతో ఆధిక్యాన్ని సంపాదించలేకపోయింది. గుజరాత్ జెయింట్స్‌లో రైడర్ రాకేశ్ 14 పాయింట్లు, ఆల్‌రౌండర్ రోహిత్ తొమ్మిది పాయింట్లు సాధించారు. తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్ నరేందర్ తొమ్మిది పాయింట్లతో పోరాడాడు.
అంతకుముందు ఇదే వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబాపై బెంగళూరు బుల్స్ 42-37 తేడాతో గెలిచింది. అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి యు ముంబా పైచేయి సాధించింది. 24-22తో ముందంజలో ఉంది. కానీ సెకండ్ హాఫ్‌లో విఫలమైంది. కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఒక్కసారి ఆలౌటై పాయింట్లు సమమర్పించుకుంది.
బెంగళూరు బుల్స్ జట్టులో రైడర్లు సుశీల్ (10 పాయింట్లు), అక్షిత్ ఎనిమిది పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టులో రైడర్ భగవాన్ సూపర్-10తో పోరాడారు. ఇవాళ ఢిల్లీ వేదికగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్‌తో పాట్నా పైరేట్స్, రాత్రి 9 గంటలకు దబాంగ్ ఢిల్లీతో పుణెరి పల్టాన్ తలపడనున్నాయి. కాగా, పాయింట్ల పట్టికలో జైపుర్, పుణెరి, ఢిల్లీ, గుజరాత్ జట్లు టాప్-4లో ఉన్నాయి. ఇప్పటికే జైపుర్ పింక్ పాంథర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.