ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జైపుర్ వేదికగా ఆదివారం జరిగిన దబాంగ్ ఢిల్లీ - పాట్నా పైరేట్స్ మ్యాచ్ 'టై' ముగిసింది. విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి పాట్నా చెక్ పెట్టింది. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 20-14 పాయింట్లతో పైచేయి సాధించింది.
కానీ సెకండ్ హాఫ్‌లో పాట్నా పైరేట్స్ విజృంభించింది. పుంజుకుని వరుస పాయింట్లు సాధించింది. దబాంగ్ కూడా తిరిగి పోటీ ఇవ్వడంతో మ్యాచ్ హొరాహోరీగా సాగింది. పాట్నా రైడర్ సచిన్ (10) ఆఖర్లో ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు చివరి నాలుగు రైడ్లు జాగ్రత్తగా ఆడాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది.

దబాంగ్ ఢిల్లీ జట్టులో రైడర్లు అషు మాలిక్ (14), మీథూ శర్మ (8) రాణించారు. డిఫెండర్లు విక్రాంత్ నాలుగు, ఆశిష్ మూడు పాయింట్లు సాధించారు. పాట్నా పైరేట్స్‌లో సచిన్ (10), మంజీత్ (10) సూపర్-10తో సత్తాచాటారు. జైపుర్ వేదికగా అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌ను హర్యానా స్టీలర్స్ 36-31 తేడాతో ఓడించింది.
హర్యానా విజయంలో రైడర్లు వినయ్ (10), రంజిత్ (7), ఢిపెండర్లు జయదీప్ (5), రాహుల్ (5) కీలకపాత్ర పోషించారు. తలైవాస్ జట్టులో కెప్టెన్, డిఫెండర్ సాగర్ అయిదు పాయింట్లతో పోరాడాడు. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తమిళ్ తలైవాస్ ఓటమి దాదాపు ఖరారైనట్లుగా భావించారంతా. హర్యానా 22-12తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్‌లో తమిళ్ తలైవాస్ పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. అయితే అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్, జైపుర్ పింక్ పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ టాప్-4లో నిలిచాయి. టేబుల్ ఆఖర్లో తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ జట్లు ఉన్నాయి. ఇవాళ బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్, జైపుర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా పోటీపడనున్నాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.