ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్‌కు దబాంగ్ ఢిల్లీ జట్టు అర్హత సాధించింది. ఇప్పటికే జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ఢిల్లీ జట్టు మరో దశకు క్వాలిఫై అయ్యింది.
కోల్‌కతాలో నేతాజీ ఇండోర్ స్టేడియం వేదికగా యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించిది. 50-34 పాయింట్ల తేడాతో నెగ్గింది. మ్యాచ్ ఆది నుంచే హర్యానా పైచేయి సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 27-12తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండ్ హాఫ్‌లో యూపీ ప్రతిఘటించింది. హర్యానాకు అంత ఈజీగా పాయింట్లు ఇవ్వలేదు. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఉన్న భారీ ఆధిక్యంతో హర్యానా సునాయాసంగా గెలిచింది.

హర్యానా రైడర్లు శివమ్ (12 పాయంట్లు), వినయ్ (10 పాయింట్లు) సూపర్-10తో సత్తాచాటారు. డిఫెండర్ మోహిత్ నందాల్ అయిదు పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్ జట్టులో మహిపాల్ 11 పాయింట్లతో పోరాడాడు. అదే వేదికగా అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్ 32-41 పాయింట్లతో గెలిచింది.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి గుజరాత్ 14-18తో పైచేయి సాధించింది. సెకండ్ హాఫ్‌లోనూ గుజరాత్ అదే జోరు కొనసాగించి విజయం సాధించింది. సొంతగడ్డపై ఆడుతున్న బెంగాల్ వారియర్స్ జట్టులో నితీన్ కుమార్ 12 పాయింట్లు, మణిందర్ సింగ్ తొమ్మిది పాయింట్లతో పారాడారు. గుజరాత్ జట్టులో రాకేశ్ (11) సూపర్-10 సాధించాడు.
కాగా, కోల్‌కతా వేదికగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పాట్నా పైరేట్స్‌తో యు ముంబా రాత్రి 8 గంటలకు, బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ రాత్రి 9 గంటలకు తలపడనుంది. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.