ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది. 29-54 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌కు ఇది 14వ ఓటమి కావడం గమనార్హం. సొంత మైదానంలో చివరి మ్యాచ్‌లోనూ ఓడి మరోసారి అభిమానులను ఉస్సూరుమనిపించింది. కనీస పోటీ ఇవ్వకుండా ప్రత్యర్థి జట్టుకు తలవంచింది.
మ్యాచ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్‌పై తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 20-11 పాయింట్లతో తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది. టైటాన్స్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్‌లో తెలుగు టైటాన్స్ ప్రదర్శన తీసికట్టుగా మారింది. ఏకంగా రెండు సార్లు ఆలౌటైంది. రైడింగ్, డిఫెండింగ్‌లో పూర్తిగా విఫలమైంది.

ఎప్పటిలానే తెలుగు టైటాన్స్ కెప్టెన్, రైడర్ పవన్ షెహ్రావత్ పది పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండ్ అజత్ పవార్ ఏడు పాయింట్లు సాధించాడు. తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్లు అజింక్య పవార్ 11, నరేందర్ పది పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. తలైవాస్ కెప్టెన్, డిఫెండర్ ఎనిమిది పాయింట్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు.
అంతకుమందు జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై దబాంగ్ ఢిల్లీ 35-32 తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 14 పాయింట్లతో సత్తాచాటాడు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి దబాంగ్ ఢిల్లీ 18-13తో లీడ్‌లో నిలిచింది. అదే జోరును కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించింది. రెండో అర్ధభాగంలో హర్యానా పోరాడినప్పటికీ అది ఓటమి అంతరాన్ని తగ్గించుకోడానికే పరిమితమైంది.
కాగా, పాయింట్ల పట్టికలో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ టాప్-4లో నిలిచారు. తెలుగు టైటాన్స్, యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్ వరుసగా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, హైదరాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.