ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ చేతిలో తెలుగు టైటాన్స్ 30-37 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌కు ఇది 13వ ఓటమి కావడం గమనార్హం. సొంత మైదానంలో గత మ్యాచ్‌లో నెగ్గి ఫర్వాలేదనిపించినా టైటాన్స్ మరోసారి అభిమానులను ఉస్సూరుమనిపించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే టైటాన్స్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. రైడింగ్, డిఫెండింగ్‌లో వరుసగా విఫలమవుతూ ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పాయింట్లు సమర్పించుకున్నారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి తెలుగు టైటాన్స్ 12-24 పాయింట్లతో దారుణంగా వెనుకబడింది. ఫస్ట్ హాఫ్‌లో ఒక్కసారి ఆలౌట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్‌లో టైటాన్స్ గొప్పగా పుంజుకుంది.

రైడర్లు చెలరేగడంతో రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ 18 పాయింట్లు సాధించింది. మరోవైపు హర్యానా స్టీలర్స్ 13 పాయింట్లు మాత్రమే దక్కించుకుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో లభించిన భారీ ఆధిక్యంతో హర్యానా విజయతీరాలకు చేరింది. టైటాన్స్ జట్టులో ప్రఫుల్ జవారె, సంజీవి చెరో ఆరు పాయింట్లతో పోరాడారు. హర్యానా టీమ్‌లో డిఫెండర్లు రాహుల్ 8, మోహిత్ నందాల్ 6 పాయింట్లతో రాణించారు. రైడర్లు శివమ్, వినయ్ తలో ఆరు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
గచ్చిబౌలి వేదికగా సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై జైపుర్ పింక్ పాంథర్స్ 42-25 తేడాతో ఘన విజయం సాధించింది. జైపుర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ ఏకంగా 15 పాయింట్లతో చెలరేగాడు. అతడికి భవాని రాజ్‌పుత్ (7) చక్కని సహకారం అందించాడు. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి జైపుర్ 13-12తో ఒక్క పాయింట్ ఆధిక్యంలోనే నిలిచింది. కానీ సెకండ్ హాఫ్‌లో విజృంభించింది. బెంగాల్ జట్టును రెండు సార్లు ఆలౌట్ చేసి పాయింట్లు కొల్లగొట్టింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు యు ముంబా-పుణెరి పల్టాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.