ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11కు రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో క్రీడా అభిమానులను సందడి చేయడానికి కబడ్డీ ముస్తాబవుతోంది. ఇటీవల నిర్వహించిన వేలంలో ఆటగాళ్లు రూ.కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే. 12 ఫ్రాంఛైజీలు 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. పీకేఎల్ చరిత్రలో అత్యధిక మంది ఆటగాళ్లు రూ.కోటికి పైగా ధర దక్కించుకున్న వేలంగా ఈసారి చరిత్రకెక్కింది. ఎనిమిది మంది ఆటగాళ్లు రూ.కోటిపైగా ధర పలకడం విశేషం.
రైడర్ సచిన్ తన్వార్ కోసం తమిళ్ తలైవాస్ ఏకంగా రూ.2.15 కోట్లు వెచ్చించింది. ఇర ఇరాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్‌రెజా చియానె కోసం హర్యానా స్టీలర్స్ రూ. 2.07 కోట్లు కుమ్మరించింది. ఇలా ఆటగాళ్ల చేరికతో జట్లన్నీ ఎంతో బలంగా మారాయి. టైటిల్ ఫేవరేట్‌గా 12 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. అయితే 11 సీజన్‌లో అందరి కళ్లు ఈ ఆటగాళ్లపైనే ఉన్నాయి.

సచిన్ తన్వార్
రైడర్ సచిన్ కోసం ఫ్రాంచైజీలన్ని పోటీపడ్డాయి. సీజన్ 5లో గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ ఆ తర్వాత నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. తొలి సీజన్‌లో 173 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ తర్వాత పట్నా పైరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 184 పాయింట్లు కొల్గగొట్టాడు. మొత్తంగా 952 పాయింట్లతో అత్యధిక పాయింట్లు సాధించిన రైడర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా, సచిన్ రాకతో తమిళ్ తలైవాస్ ప్రదర్శన ఎలా ఉంటుదనే ఆసక్తి అందరిలో మొదలైంది. గత సీజన్‌లో తలైవాస్ తొమ్మిదో స్థానంలో ఉంది.
పర్దీప్ నర్వాల్
స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ వేలంలో రూ.70 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో పర్దీప్ అంచనాలను అందుకోకపోవడంతో యూపీ యోధాస్ వదులుకుంది. అయితే పర్దీప్ అనుభవం జట్టుకు బలంగా మారుతుంది. అతని పేరిట ప్రో కబడ్డీ లీగ్‌లో అరుదైన రికార్డులు ఉన్నాయి. అత్యధిక పాయింట్లు (1690) సాధించిన రైడర్ పర్దీప్‌యే. అంతేకాక మోస్ట్ సక్సెఫుల్ రైడ్స్, అత్యధిక సూపర్-10లు ఈ దుబ్కీ కింగ్ పేరు మీదే ఉన్నాయి. కాగా, గత సీజన్‌లో బెంగళూరు బుల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఫజెల్ అత్రాచలి
రైడర్లతో పోటీ పడుతూ డిఫెండర్ ఫజెల్ అత్రాచలి పాయింట్ల మోత మోగిస్తుంటాడు. ప్రో కబడ్డీలీగ్ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు సాధించింది ఫజెల్‌యే. లెఫ్ట్ కార్నర్‌లో ఉంటూ ప్రత్యర్థిని పడగొట్టే ఫజెల్ 458 పాయింట్లు సాధించాడు. యూ ముంబా, పాట్నా పైరేట్స్ టైటిల్స్ సాధించడంలో ఫజెల్‌ది కీలక పాత్ర. అయితే గత సీజన్‌లో 66 పాయింట్లు సాధించిన ఈ స్టార్ ఢిపెండర్‌ను గుజరాత్ జెయింట్స్ వదులుకోవడంతో వేలంలో బెంగాల్ వారియర్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన బెంగాల్ ఈసారి తన మెరుగైన ప్రదర్శన చేస్తుందేమో చూడాలి.