
అహ్మదాబాద్: గత మూడు నెలలుగా అభిమానులకు వినోదాన్ని పంచుతున్న ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. సీజన్ ఆరంభం నుండే అదిరిపోయే ఆటతో ఆకట్టుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిచిన దబంగ్ ఢిల్లీ, రెండో ప్లేస్‌తో లీగ్‌ను ముగించిన బెంగాల్ వారియర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. ఢిల్లీ, బెంగాల్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఎవరు గెలిచినా పీకేఎల్‌లో కొత్త విజేత అవుతారు.
బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఢిల్లీ 44-38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరును చిత్తుచేసింది. రెండో సెమీస్‌లో బెంగాల్ 37-35తో ముంబైను ఓడించింది. ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ (13 పాయింట్లు), చంద్రన్ రంజిత్ (9 పా యింట్లు) రాణించారు. బెంగాల్ రైడర్ సుఖేష్ హెగ్డే (8 పాయింట్లు) సత్తా చాటాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఇక్కడే టైటిల్ పోరు జరగనుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరిన ఢిల్లీ సెమీఫైనల్లోనూ అదే జోరు కనబర్చింది. నవీన్ కుమార్, రంజిత్ చెలరేగడంతో మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిక్యంలో నిలిచింది. మూడో నిమిషంలోనే బెంగళూరు ఆలౌటవడంతో .. దీంతో ఢిల్లీకి ఆరు పాయింట్ల ఆధిక్యం లభించింది. కాపేసటికి పవన్ సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు సాధించి బుల్స్‌ను పోటీలోకి తెచ్చాడు. ఇక తొలి అర్ధభాగంలోనే బెంగళూరు మరోసారి ఆలౌటవడంతో.. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఢిల్లీ 26-18తో నిలిచింది.
బుల్స్ రైడర్ పవన్ ద్వితీయార్ధంలో రెచ్చిపోయాడు. వరుస రైడ్లలో పాయింట్లు సాధిస్తూ.. అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే పవన్‌కు సహకారం అందించే వారు కరువవడంతో.. బెంగళూరు కోలుకోలేకపోయింది. ఈ సమయంలో ఢిల్లీ పుంజుకోవడంతో మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. బుల్స్ మరోసారి ఆలౌటవడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. మొత్తం మ్యాచ్‌లో ఢిల్లీ రైడర్లు 23 పాయింట్లు సాధిస్తే.. బుల్స్ ఆటగాళ్లు 28 చేశారు. కానీ ట్యాక్లింగ్‌లో ఢిల్లీ 15 మందిని పట్టేస్తే.. బెంగళూరు మాత్రం కేవలం 6 పాయింట్లే ఖాతాలో వేసుకుంది.
మరో సెమీస్‌లో బెంగాల్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఇరు జట్లు పోరాడటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి అర్ధ భాగంలో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందనగా.. ముంబై ఆలౌటవడంతో బెంగాల్ నాలుగు పాయింట్ల ఆధిక్యం సాధించింది. అదే ఉపులో బెంగాల్ 18-12తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో సగంలో సుఖేశ్ హెగ్డే ఒకే రైడ్‌లో నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 10 పాయింట్లకు పెంచాడు. ఇక ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. బెంగాల్ 33-25తో నిలిచింది. ఈ దశలో ముంబై రైడర్ అజింక్యా సూపర్ రైడ్ ద్వారా 4 పాయింట్లు సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.
ఓ దశలో పాయింట్ల అంతరం 2కు చేరింది. అభిషేక్ సింగ్ రైడింగ్‌లో పాయింట్ తేవడంతో పాటు ట్యాక్లింగ్‌లో సందీప్ నర్వాల్ ప్రత్యర్థి రైడర్‌ను పట్టేయడంతో ఇరు జట్ల స్కోర్లు 35-35తో సమమయ్యాయి. ఇక రెండు నిమిషాల ఆట మాత్రమే మిగిలుండటంతో.. ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. తర్వాతి రైడ్‌లో అభిషేక్ ప్రత్యర్థి కోర్టులో పట్టుబడటంతో పాటు చివరి రైడ్‌లో అర్జున్ విఫలమవడంతో రెండు పాయింట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.