హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తొలి ఓటమి చవిచూసింది. ఇంటర్ జోన్ చాలెంజ్‌లో భాగంగా లక్నోలో ఆదివారం పట్నా పైరేట్స్ 42-47తో పుణెరి పల్టన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన పట్నాకు ఇదే తొలి ఓటమి.
పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 19 పాయింట్లు సాధించినా పట్నాను గెలిపించలేకపోయాడు. పుణెరి రైడర్లు రాజేష్ మొండల్ 10 పాయింట్లు సాధించగా, దీపక్ నివాస్ హుడా 9 రైడ్ పాయింట్లు సాధించారు. రైడర్లు చకచకా పాయింట్లు తేవడంతో విరామానికి పుణెరి 25-13తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

పుణెరి డిఫెండర్ రహ్మాన్ 6 టాకిల్ పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్‌లో పట్నా మొత్తం 31 పాయింట్లతో పైచేయి సాధించినప్పటికీ డిఫెన్స్‌లో మాత్రం తేలిపోయుంది. రైడింగ్‌లో మొత్తం 29 పాయింట్లు రాబట్టిన పుణెరి పల్టన్ డిఫెన్స్‌లోనూ 12 పాయింట్లతో పైచేయి సాధించింది.
ఇక రెండో అర్ధభాగంలో పుంజుకున్న పట్నా 20-30తో నిలిచింది. 32వ నిమిషంలో పర్దీప్ మరో సూపర్ రైడ్ చేయడంతో పట్నా రేసులోకొచ్చినట్టు కనిపించింది. ఈ సమయంలో వరుసగా పాయింట్లు సాధించి తన ఆధిక్యం పెంచుకుంటూ పోయిన పుణెరి పల్టన్ 40-30తో నిలిచింది.
మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా పట్నా పైరేట్స్ వరుస పాయింట్లతో దూసుకొచ్చినా ఫలితం లేకపోయింది. చివరి రైడ్‌లో వికాస్ జగ్లాన్ మూడు పాయింట్లు తెచ్చినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
యూపీ యోధాపై జైపూర్ విజయం
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. యూపీ యోధాతో జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 24-22తో ఉత్కంఠ విజయం సాధించింది. చివరి వరకూ ఆధిక్యంలోనే ఉన్న యోధా 40వ నిమిషంలో ఆలౌటై మ్యాచ్‌ను చేజార్చుకుంది. జైపూర్ జట్టులో తుషార్ 5, నితిన్ 5, జస్వీర్ సింగ్ 4 పాయింట్లు సాధించారు. మరోవైపు యూపీ జట్టు లో కెప్టెన్ నితిన్ తోమర్(5), రిశాంక్ (4) ఆకట్టుకున్నా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.