హైదరాబాద్: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో పట్నా పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ చెలరేగుతున్నాడు. సోమవారం హర్యానా స్టీలెర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్దీప్ ఒక్కడే 34 పాయింట్లతో సత్తా చాటాడు. దీంతో ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యధిక పాయింట్లను సాధించిన రైడర్‌గా పర్దీప్ నర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు ఐదో సీజన్‌లో 300 రైడ్ పాయింట్లతో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు బెంగళూరు బుల్స్‌కు చెందిన రోహిత్‌కుమార్ 32 రైడ్ పాయింట్ల రికార్డును అధిగమించాడు. హర్యానా స్టీలెర్స్‌తో ఎలిమినేటర్-2లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 69-30తో పట్నా విజయంసాధించింది.

ప్రదీప్ నర్వాల్ రాణించడంతో ఆరంభంలోనే 11-7తో ఆధిక్యంలోకి వెళ్లిన పట్నా ఆ తర్వాత రెండో అర్ధభాగంలో కూడా అదే జోరు కొనసాగించింది. 33వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన పర్దీప్ ఒకేసారి ఆరుగురి ఆటగాళ్లను అవుట్ చేశాడు. అదే సమయంలో ఒక బోనస్ ను కూడా సాధించాడు.
తద్వారా మొత్తం తొమ్మిది పాయింట్లను ఒక రైడ్ ద్వారా సాధించినట్లు అయింది. పర్దీప్ జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటైంది. ఇక, ఎలిమినేటర్-1లో పుణె 40-38తో యూపీ యోధను ఓడించింది. హోరాహోరీ సాగిన ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా రైడింగ్‌లో 10 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ప్రో కబడ్డీలో మంగళవారం
ఎలిమినేటర్-3: పుణె Vs పట్నా
క్వాలిఫయర్-1: గుజరాత్ Vs బెంగాల్