
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో హర్యాణా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ విజయం సాధించాయి. మొదట జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవస్‌ను హర్యానా స్టీలర్స్ ఓడించగా.. రెండో మ్యాచ్‌లో యుముంబాను పాట్నా పైరేట్స్ ఓడించింది. హర్యానా స్టీలర్స్‌లో అశిష్, పాట్నా పైరేట్స్‌లో సచిన్ చెలరేగి ఆడారు. అటు ఈ విజయాలతో పాయింట్స్ పట్టికలో పాట్నా పైరేట్స్ అగ్ర స్థానానికి దూసుకెళ్లగా.. హర్యాణా స్టీలర్స్ రెండో స్థానానికి చేరుకుంది.
హర్యాణా స్టీలర్స్, తమిళ్ తలైవస్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఫస్ట్ హాఫ్ సమయానికి హర్యాణా స్టీలర్స్ 15-12 తేడాతో స్వల్ప అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో హర్యాణా స్టీలర్స్ దూకుడుగా ఆడింది. చివరికి మ్యాచ్‌ను 37-29 తేడాతో గెలుచుకుంది. హర్యాణా జట్టు రైడర్ అశిష్ 16 పాయింట్లతో చెలరేగాడు. వికాశ్ 8 పాయింట్లతో సహకరించాడు. వినయ్ 3, జయదీప్, అక్షయ్ కుమార్ రెండేసి ట్యాకిల్ పాయింట్లు సాధించారు. ఇక తమిళ్ తలైవస్‌లో మంజీత్ సూపర్ 10 సాధించాడు. అజింక్యా పవార్ 8 పాయింట్లతో సహకరించాడు. సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు సాధించాడు. దీంతో టోర్నీలో 50 ట్యాకిల్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా వరుసగా 4 సీజన్లలో 50 అంతకంటే ఎక్కువ ట్యాకిల్ పాయింట్లు సాధించిన డిఫెండర్‌గా సుర్జీత్ సింగ్ నిలిచాడు.
ఇక మరో మ్యాచ్‌లో యు ముంబాను పాట్నా పైరేట్స్ ఓడించింది. యు ముంబాపై పాట్నా 47-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పాట్నా జట్టులో సచిన్ 16 రైడ్ పాయింట్లతో చెలరేగాడు. అతనికి తోడుగా గుమన్ సింగ్ 11 పాయింట్లతో రాణించాడు. మోను 4, నీరజ్ కుమార్ 3, ప్రశాంత్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించారు. ఇక యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 13, అజిత్ కుమార్ 11 రైడ్ పాయింట్లతో రాణించారు. ఇక రింకు, శివమ్ నాలుగేసి ట్యాకిల్ పాయింట్లు సాధించారు. అటు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాట్నా పైరేట్స్ అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. 11 మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో హర్యాణా స్టీలర్స్ ఉంది. 9 మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు ఖాతాలో 58 పాయింట్లు ఉన్నాయి. కాగా మూడో స్థానంలో దబాంగ్ ఢిల్లీ, నాలుగో స్థానంలో బెంగళూరు బుల్స్ ఉన్నాయి.