హైదరాబాద్: వరుస ఓటమిలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు టైటాన్స్‌కు గొప్ప ఊరట. ప్రొ కబడ్డీ లీగ్‌లో 7 మ్యాచ్‌ల ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37-32తో యు ముంబాపై గెలిచింది.
ఈ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్ రాహుల్ చౌదరి (13) విజృంభించి టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో టైటాన్స్ జట్టు యు ముంబాను రెండు సార్లు ఆలౌట్ చేసింది.

ఒకానొక దశలో టైటాన్స్ 12-7తో ముందంజలో నిలిచింది. అయితే అనూప్ కుమార్ (7) కీలక సమయంలో సత్తా చాటడంతో ముంబా పుంజుకుంది. 19-17తో టైటాన్స్‌ను సమీపించిన ముంబా ఆఖర్లో 27-27తో స్కోరు కూడా సమం చేసింది. ఈ సమయంలో రాహుల్ చౌదరి వరుసగా పాయింట్లు సాధించడం, ముంబా ఆటగాళ్లు రైడ్ పాయింట్లు తేవడంలో విఫలమయ్యారు.
దీంతో తెలుగు టైటాన్స్ 37-32 పాయింట్లతో గెలిచింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరి 13, సోంబిర్ శేఖర్ 8 పాయింట్ల, ట్యాకిలింగ్‌లో 14 పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టు 18 రైడింగ్, 9 ట్యాకిలింగ్, 2 ఆలౌట్, 3 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించింది.
హర్యానా చేతిలో యూపీ యోధ చిత్తు:
ఇంటర్ లీగ్ పోరులో భాగంగా యూపీ యోధతో జరిగిన మ్యాచ్‌లో 36-29 స్కోరుతో హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. స్టార్ రైడర్లు వికాస్ కాందోలా 9, సురేందర్ నదా 7 రైడింగ్ పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌లో హర్యానాకు ఎదురేలేకుండా పోయింది. యూపీ జట్టులో రిషాంక్ దేవాదిగ 6, సాగర్ 6 రైడింగ్ పాయింట్లు సాధించారు.
ప్రో కబడ్డీలో ఆదివారం
పట్నా పైరేట్స్ × పుణెరీ పల్టాన్ రాత్రి 8 గంటలకు
యూపీ యోధ × జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి 9 గంటలకు
వేదిక: లక్నో
'స్టార్ స్పోర్ట్స్-2' చానల్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం