హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు వరుస ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 42-37తో పుణెరి పల్టాన్ చేతిలో పోరాడి ఓడింది. తొలి అర్ధభాగంలో ఒక దశలో 0-18తో వెనకబడిన టైటాన్స్ ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం.
టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి చివరి 10 నిమిషాల్లో సూపర్ రైడ్‌తో ప్రత్యర్థిని ఆలౌట్ చేసినప్పిటకీ... జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా టైటాన్స్ 36-40తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చేసింది. అయితే మరో నిమిషంలో మ్యాచ్ పూర్తవుతుందనగా.. రాహుల్ చౌదరిని డిఫెండర్ గిరీష్ సూపర్ ట్యాకిల్ చేసి స్కోరు 42కు పెంచడంతో పుణె విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రైడింగ్‌లో 9 పాయింట్లతో చెలరేగాడు. కెప్టెన్ దీపక్ హుడా (9) కూడా ఆ జట్టు గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో పుణె 8 మ్యాచ్‌ల్లో 31 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ఓటమి తెలుగు టైటాన్స్ క్వాలిఫయింగ్ ఆశలపై దెబ్బ కొట్టింది.
13 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకి ఇది 9వ ఓటమి కావడం విశేషం. జోన్ బీలో మొత్తం 24 పాయింట్లతో టైటాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరో విజయం సాధించిన పుణె జోన్ ఏలో 31 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్-దబాంగ్ ఢిల్లీల మధ్య జరిగిన మరో మ్యాచ్ 31-31తో టైగా ముగిసింది.
ప్రొ కబడ్డీలో శుక్రవారం:
హర్యానా స్టీలెర్స్ × పట్నా పైరేట్స్ (రాత్రి 8 గం)
గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ × యుపీ యోధా (రాత్రి 9 గం)
స్టార్‌స్పోర్ట్స్-2లో