హైదరాబాద్: సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బెంగాల్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 24-30 తేడాతో పరాజయం పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ కి ఇది వరుసగా నాలుగో ఓటమి.
పేలవ డిఫెన్స్ ఈ సారి జట్టు ఓటమికి కారణమైంది. ఆరంభంలో రాహుల్ వెంటవెంటనే మూడు పాయింట్లు తేవడంతో 5-3తో మ్యాచ్ ను ధాటిగా ఆరంభించిన టైటాన్స్ తర్వాత చతికిలపడింది. మనీందర్ రెండు రైడ్స్‌లో 4 పాయింట్లు తీసుకెళ్లడంతో 9వ నిమిషంలోనే ఆలౌటైన తెలుగు జట్టు 8-13తో వెనుకబడింది.

ఆ తర్వాత వికాస్ పోరాడుతున్నా డిఫెండర్లు పూర్తిగా చేతులెత్తేశారు. తొలి అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క టాకిల్ పాయింట్ రాబట్టింది. వికాస్, రాహుల్ రైడింగ్ పాయింట్లు సాధించడంతో తెలుగు టైటాన్స్ 14-19తో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో పుంజుకొనేందుకు వచ్చిన అవకాశాల్ని టైటాన్స్ వినియోగించుకో లేకపోయింది.
తొలి రైడ్‌లోనే కున్ లీని పట్టేసే ప్రయత్నంలో టైటాన్స్ రెండు పాయింట్లు జారవిడిచింది. ఆ వెంటనే డూ ఆర్ డై రైడ్‌లో రాహుల్ ప్రత్యర్థులకు దొరికిపోయాడు. అప్పటికి కోర్టులో ముగ్గురు ప్లేయర్లే మిగలడంతో మరోసారి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే కున్ లీని సూపర్ టాకిల్ చేసిన టైటాన్స్ 18-22తో ప్రత్యర్థికి చేరువగా వచ్చింది.
నీలేష్ పోరాడుతున్నా, రెండో అర్ధభాగంలో రాహుల్ 15 నిమిషాలు కోర్టు బయట ఉండడం జట్టును దెబ్బతీసింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెంగాల్ విజయం సాధించింది. మణిందర్ సింగ్ (11 పాయింట్లు), జంగ్ కున్ లీ (8 పాయింట్లు) బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా వికాస్ ఎనిమిది పాయింట్లు సాధించాడు. రాహుల్ చౌదరి, నీలేష్ చెరో ఐదు పాయింట్లు తెచ్చారు. ఇక తెలుగు టైటాన్స్ 16 రైడ్, 7 ట్యాకిల్, 1 అదనపు పాయింట్లు సాధించగా బెంగాల్ వారియర్స్ 19 రైడ్, 6 ట్యాకిల్, 2 ఆలౌట్, 3 అదనపు పాయింట్లు సాధించింది.