హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో జరిగిన ఇంటర్ జోన్ మ్యాచ్‌లో 29-19 పాయింట్ల తేడాతో టైటాన్స్ చిత్తుగా ఓడింది. లీగ్‌లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఏడో ఓటమి.
ఐదో సీజన్ ఆరంభం నుంచి జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్న రాహుల్ చౌదరి కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా మూడు రైడ్ పాయింట్లే సాధించడం విశేషం. టైటాన్స్‌లో అత్యధికంగా రైడర్ వినోద్ కుమార్ 4 పాయింట్లు తెచ్చాడు.

ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఇటు రైడింగ్‌లోనూ అటు ట్యాకిలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. గుజరాత్ స్టార్ రైడర్ సచిన్ ఈ మ్యాచ్‌లో 11 రైడింగ్ పాయింట్లు సాధించాడు. ఇక సుకేశ్ హెగ్డే 7, అబొజోర్ 4 పాయింట్లతో చెలరేగారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ 7-20తో వెనుకబడింది.
ఇక రెండో అర్దభాగంలో తెలుగు టైటాన్స్ పుంజుకుని పోరాడినా ఈ ప్రదర్శన విజయం సాధించడానికి ఏమాత్రం సరిపోలేదు. జెయింట్స్ 17 రైడింగ్, 9 ట్యాకిల్, 2 ఆలౌట్, 1 ఎక్స్‌ట్రా పాయింట్ సాధించగా.. టైటాన్స్ జట్టు 12 రైడింగ్, 5 ట్యాకిల్, 2 ఎక్స్‌ట్రా పాయింట్లు సంపాదించి ఓటమిపాలైంది.