
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ జట్టుకు ఈ సీజన్‌లో ఎదురులేకుండా పోయింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న ఢిల్లీ.. గత మ్యాచ్‌ను టైచేసుకున్నా వెంటనే పుంజుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 43-39తో పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ తరఫున విజయ్ (13 పాయింట్లు), నవీన్ (11 పాయింట్లు) సూపర్-10లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పాట్నా స్టార్ రైడర్ 'డుబ్కీ కింగ్' పర్‌దీప్ నర్వాల్ 19 పాయింట్లతో చెలరేగినా పాట్నాను గెలిపించలేకపోయాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రైడర్లు పోటాపోటీగా పోరాడటంతో పలుమార్లు స్కోర్లు సమం అవుతూ వచ్చాయి. ఓ దశలో ఢిల్లీ 5-4తో ముందంజలో నిలిచింది. ఇక తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఇరు జట్లు 13-13తో నిలిచాయి. విరామం అనంతరం పాట్నా జోరు కనబర్చి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 24వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్ చేసి 19-17తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అదే ఊపులో 33-27తో పట్టు సాధించింది. ముఖ్యంగా పర్‌దీప్ వరుస పాయింట్లు సాధించాడు.
అయితే పాట్నా 36-30తో ఉన్న దశలో విజయ్ ఒకే రైడ్‌లో 5 పాయింట్లు సాధించడంతో మరో 4 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ఢిల్లీ పోటీలొకొచ్చింది. ఆ తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఢిల్లీ జట్టు కీలక తరుణంలో ఆధిపత్యాన్ని కనబర్చి మ్యాచ్‌ను 43-39తో చేజిక్కించుకుంది. మొత్తం మ్యాచ్‌లో పర్‌దీప్ 8 నిమిషాల 25 సెకన్లు కోర్టు బయట ఉండటం కూడా పాట్నా పరాజయానికి కారణం అయింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం పైచేయిలో ఉన్న పాట్నా .. చివరలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
ఈ విజయంతో దబంగ్ ఢిల్లీ 14వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 77 పాయింట్లతో ఢిల్లీ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు పాట్నా పైరేట్స్ 40 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. శుక్రవారం ముంబా vs బెంగళూరు.. టైటాన్స్ vs జైపూర్ జట్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి.