PKL 2025: విశాఖలోని పోర్టు స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్లో భాగంగా దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 41-34 తేడాతో బెంగళూరు బుల్స్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఢిల్లీ ఈ సీజన్లో తమ మొదటి విజయాన్ని సాధించగా.. బెంగళూరు బుల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
ఢిల్లీ ఆధిపత్యం.. అశు మాలిక్ మెరుపులు
దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అశు మాలిక్ ఈ మ్యాచ్‌లో 15 పాయింట్లతో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఢిల్లీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడో నిమిషంలో 2-1 ఆధిక్యంలో ఉన్నప్పుడు.. ఢిల్లీ డిఫెన్స్ 'డూ ఆర్ డై' రైడ్‌లో బుల్స్ రైడర్ ఆకాష్ షిండేను ఔట్ చేసి తమ బలమైన వ్యూహాన్ని చూపించింది. ఐదో నిమిషంలో అశు మాలిక్ చేసిన సూపర్ రైడ్‌తో ఢిల్లీ స్కోర్ 6-1కి పెరిగి బెంగళూరు బుల్స్‌ను ఆలౌట్ చేసే దిశగా నెట్టింది. సూపర్ టాకిల్ సమయంలో కూడా అశు మాలిక్ పాయింట్లు సాధించాడు. అనంతరం ఢిల్లీ డిఫెన్స్ అద్భుతంగా పనిచేసి 10-3 ఆధిక్యం సాధించింది.

బుల్స్ పోరాటం.. కానీ ప్రయోజనం లేదు..
ఢిల్లీ ఆలౌట్ తర్వాత కూడా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యాన్ని 12-3కి పెంచుకుంది. అయితే యోగేష్.. అశు మాలిక్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు బుల్స్ కొంత ఊరట పొందింది. కానీ ఢిల్లీ జట్టు ఆటగాడు నీరజ్ మళ్లీ ఆధిక్యాన్ని 8 పాయింట్ల తేడాతో నిలబెట్టాడు. హాఫ్‌టైమ్ సమయంలో 21-11 ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో అశు మాలికత్ మరోసారి బుల్స్‌ను ఆలౌట్ చేసి ఢిల్లీకి 28-13 ఆధిక్యం తెచ్చి పెట్టాడు. చివరి ఐదు నిమిషాల్లో బుల్స్ పోరాటం కొనసాగించినప్పటికీ.. అప్పటికే ఆలస్యం కావడంతో పాయింట్ల తేడాను పూడ్చలేకపోయింది. దీంతో దబాంగ్ ఢిల్లీ 41-34 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ జట్టులో నీరజ్ నర్వాల్(7), ఫజల్ అత్రాచలి, సౌరవ్ నందల్(చెరో 3 పాయింట్లు) కూడా బాగా ఆడారు. మరోవైపు బెంగళూరు బుల్స్‌లో ఆకాష్ షిండే(3) నిరాశపరిచాడు. అయితే ఆకాష్ మాలిక్(8), అలీరేజా మీర్‌జైన్(10) కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
పట్నా పైరేట్స్‌పై నెగ్గిన జైపూర్ పింక్ పాంథర్స్
విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, మూడు సార్లు ఛాంపియన్ పట్నా పైరేట్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39-36 తేడాతో విజయం సాధించింది.జైపూర్ జట్టు తరపున యువ రైడర్ నితిన్ కుమార్ ధంకర్ అద్భుతంగా రాణించి 13 పాయింట్లతో మ్యాచ్ స్టార్‌గా నిలిచాడు. అతనికి తోడుగా, తన పీకేఎల్ అరంగేట్రం చేసిన అలీ సమాది చౌబ్‌తారాష్ కూడా 8 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలోనే జైపూర్ ఆధిక్యం సాధించింది. నితిన్ కుమార్ రైడింగ్‌లో పాయింట్లు సాధించగా, నితిన్ రావల్, రోనక్ సింగ్, రెజా మిర్‌బఘేరి డిఫెన్స్‌లో రాణించారు. దీంతో మొదటి పది నిమిషాల్లోనే జైపూర్ 10-8 ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెజా మిర్‌బఘేరి చేసిన ఒక కీలకమైన టాకిల్‌తో జైపూర్, పట్నా పైరేట్స్‌ను ఆలౌట్ చేసి తమ ఆధిక్యాన్ని 21-16కి పెంచుకుంది.
పట్నా పైరేట్స్ పోరాటం: మణిందర్ సింగ్ సూపర్-10
మరోవైపు, పట్నా పైరేట్స్ తరపున కెప్టెన్ మణిందర్ సింగ్ ఒంటరి పోరాటం చేసి 15 పాయింట్లతో మెరిశాడు. అతనికి సుధాకర్ మరుతుముత్తు (9 పాయింట్లు), అయాన్ లోచ్ఛబ్ మద్దతునిచ్చారు. రెండో అర్ధభాగంలో మణిందర్ సింగ్ తన సూపర్-10 పూర్తి చేసి పట్నాకు ఆశలు రేపాడు. అలీ సమాది చౌబతారాష్ తన వేగం, నైపుణ్యంతో జైపూర్ ఆధిక్యాన్ని ఆరు పాయింట్ల వరకు పెంచినప్పటికీ, మణిందర్ సింగ్ రెండు పాయింట్ల రైడ్‌తో ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు తగ్గించి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాడు.చివరి వరకు పట్నా జట్టు పోరాడినప్పటికీ, నితిన్ కుమార్, అలీ సమాదిల నిలకడైన ప్రదర్శనతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచిపెట్టింది.