ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. నాలుగు వరుస విజయాలనంతరం పరాజయాన్ని చవిచూసింది. నొయిడా వేదికగా గురువారం యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 34-40 తేడాతో ఓటమిపాలైంది. అయితే మ్యాచ్ మధ్యలో కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయం కారణంగా కోర్టును వీడటం తెలుగు టైటాన్స్‌కు ప్రతికూలంగా మారింది. 12 నిమిషంలోనే పవన్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కెప్టెన్ దూరమైనప్పటికీ తెలుగు టైటాన్స్ గొప్ప పోరాటపటిమ చూపించింది. తొలి అర్దభాగంలో యూపీ యోధాస్‌పై 20-16తో పైచేయి సాధించింది. ప్రత్యర్థి జట్టును ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్‌లో తడబడింది. ప్రత్యర్థి దూకుడు ముందు నిలవలేకపోయింది. రెండు సార్లు ఆలౌటై పాయింట్లను సమర్పించుకుంది. యూపీ యోధాస్ జట్టులో భవానీ రాజ్‌పుత్ 12 పాయింట్లు, భరత్ 11 పాయింట్లతో సత్తాచాటాడు. తెలుగు టైటాన్స్‌లో విజయ్ మాలిక్ 15 పాయింట్లతో పోరాడాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ అయిదు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కాగా, నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై యు ముంబా 35-32 పాయింట్లతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 23-12 పాయింట్లతో భారీ ఆధిక్యంలో నిలిచింది.
అయితే సెకండ్ హాఫ్‌లో తమిళ్ తలైవాస్ గొప్పగా పుంజుకుంది. రైడింగ్, ట్యాకిల్‌లో సత్తాచాటుతూ తిరిగి పోటీలోకి వచ్చింది. కానీ అంతిమంగా విజయతీరాలకు చేరలేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో మొయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. యు ముంబా జట్టులో మంజీత్ 10, అజిత్ చౌహన్ 8 పాయింట్లతో సత్తాచాటారు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, జైపుర్ పింక్ పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది.