ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ సత్తాచాటుతోంది. తిరిగి గెలుపు బాట పట్టి పాయింట్ల పట్టికలో మరోసారి రెండో స్థానానికి ఎగబాకింది. నొయిడా వేదికగా యు ముంబాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 41-35 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌కు ఇది తొమ్మిదో విజయం. అగ్రస్థానంలో హర్యానా స్టీలర్స్ (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలు) ఉంది.
మ్యాచ్ ఆరంభం నుంచే యు ముంబాపై తెలుగు టైటాన్స్ విరుచుకుపడింది. తొలి అర్ధభాగంలోనే రెండు సార్లు ఆలౌట్ చేసింది. రైడింగ్, ట్యాకిల్‌లో ముంబాను చిత్తుచేసింది. ఫస్టాఫ్‌ను 25-13 భారీ ఆధిక్యంతో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో యు ముంబా పుంజుకుంది. టైటాన్స్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. తెలుగు టీమ్ కూడా ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి లెక్క సరిచేసింది.

అయితే ఫస్టాఫ్‌లోని భారీ ఆధిక్యంతో ముంబా జట్టు పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ విజయ్ మాలిక్, రైడర్ ఆశిష్ నర్వాల్ చెరో పది పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టులో రైడర్లు మంజీత్ ఏడు పాయింట్లు, అజిత్ చౌహాన్ ఆరు పాయింట్లతో పోరాడారు. అంతకుముందు నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్‌పై యూపీ యోధాస్ 33-29 తేడాతో విజయం సాధించింది.
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. యూపీ యోధాస్‌పై ఒక్క పాయింటు ఆధిక్యంతో ఫస్టాఫ్‌ను 20-19తో జైపుర్ పింక్ పాంథర్స్ నిలిచింది.ఇరు జట్లు చెరో సారి ఆలౌటయ్యాయి. అయితే సెకండ్ హాఫ్‌లో జైపుర్ అదే జోరును కొనసాగించలేకపోయింది. యూపీ యోధాస్ జోరుగా పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. యూపీ జట్టులో భవానీ రాజ్‌పుత్ 8 పాయింట్లు, గగన్ గౌడ 6 పాయింట్లతో సత్తాచాటారు. జైపుర్ జట్టులో కెప్టెన్ అర్జున్ దేశ్‌వాల్ 6 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ నొయిడా వేదికగా రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో హర్యానా స్టీలర్స్, రాత్రి 9 గంటలకు గుజరాత్ జెయింట్స్‌తో పుణెరి పల్టాన్ తలపడనున్నాయి.