ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. పుణె వేదికగా గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లూ టైగా ముగిశాయి. 'యూపీ యొధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ' మ్యాచ్ 32-32తో టై అయ్యింది. పోరు ఆరంభం నుంచే యూపీ, ఢిల్లీ ఇరు జట్లు హోరాహొరీగా తలపడ్డాయి. తొలి అర్ధభాగాన్ని దబాంగ్ ఢిల్లీ ఒక్క పాయింటుతో 13-12తో ఆధిక్యంలో నిలిచింది.
కానీ రెండో అర్ధభాగంలో యూపీ పుంజుకుంది. ఢిల్లీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఇరు జట్లు చెరో సారి ఆలౌటయ్యాయి. అంతిమంగా సమ పాయింట్లతో పోరును ముగించాయి. దబాంగ్ ఢిల్లీ జట్టులో కెప్టెన్ అషు మాలిక్ 11, నవీన్ కుమార్ 8 పాయింట్లతో రాణించారు. యూపీ యోధాస్‌లో గగన్ గౌడ 13, భవాని రాజ్‌పుత్ 10 పాయింట్లతో సత్తాచాటారు. కాగా, ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన యూపీ ఎనిమిది విజయాలు, రెండు 'టై'లతో నాలుగో స్థానంలో, ఢిల్లీ ఏఢు విజయాలు, నాలుగు 'టై'లతో అయిదో స్థానంలో ఉన్నాయి.

పుణె వేదికగా గురువారం జరిగిన మరో మ్యాచ్ కూడా టైగా ముగిసింది. జైపుర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా మ్యాచ్ 22-22 పాయింట్లతో టై అయ్యింది. అయితే తొలి అర్ధభాగంలో జైపుర్‌పై యు ముంబా 12-8 పాయింట్లతో పైచేయి సాధించింది. కానీ రెండో అర్ధభాగంలో పింక్ పాంథర్స్ పుంజుకుంది. ట్యాకిల్‌లోనే ఏకంగా 10 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను టైగా ముగించింది.
జైపుర్ పింక్ పాంథర్స్‌లో రెజా ఆరు, రొనాక్, నీరజ్ చెరో నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబాలో సోంబిర్ ఏడు, రోహిత్ నాలుగు పాయింట్లతో రాణించారు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన యు ముంబా 9 విజయాలు, 2 టైలతో రెండో స్థానంలో ఉంది. జైపుర్ 8 విజయాలు, 2 టైలతో ఆరో స్థానంలో ఉంది. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడనున్నాయి.