ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో తెలుగు టైటాన్స్ సత్తాచాటుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. తొలి అంచె పోటీలో సొంతగడ్డపై జరిగిన చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ పుణెరి పల్టాన్‌పై 34-33 తేడాతో నెగ్గింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఒక్క పాయింట్‌తో విజయతీరాలకు చేరింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 26 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో పుణెరి (30) కొనసాగుతోంది.
మ్యాచ్ ఆరంభం నుంచే పోరు ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఆధిక్యం చేతులు మారింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు 20-20 స్కోరుతో సమంగా నిలిచాయి. రెండు జట్లు ఒక్కోసారి ఆలౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఆలౌటైంది. అయినా గొప్పగా పుంజుకుని అంతిమంగా పుణెరి పల్టాన్‌పై పైచేయి సాధించింది. ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని అందుకుంది.

ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 13 పాయింట్లతో, కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో సత్తాచాటారు. పుణెరి పల్టాన్ జట్టులో పంకజ్ 9 పాయింట్లు, అజిత్ 6 పాయింట్లతో పోరాడారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై 40-29 తేడాతో బెంగాల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. నితీన్ కుమార్ 14, మణీందర్ సింగ్ 10 పాయింట్లతో సత్తాచాటారు. బెంగళూరు బుల్స్‌లో అక్షిత్ 11, అజింక్య పవార్ 8 పాయింట్లతో పోరాడారు.
తొలి అర్ధభాగంలో బెంగాల్ వారియర్స్‌కు బెంగళూరు బుల్స్ గట్టిపోటీనే ఇచ్చింది. మూడు పాయింట్ల లోటుతో తొలి అర్ధభాగం ముగించింది. కానీ సెకండ్ హాఫ్‌లో పేలవమైన ఆట తీరు ప్రదర్శించింది. రెండు సార్లు ఆలౌటైంది. కాగా, ఇవాళ నుంచి నొయిడా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు యూపీ యోధాస్‌తో యు ముంబా తలపడనుంది. రాత్రి 9 గంటలకు గుజరాత్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ పోటీపడనుంది.