ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో వరుసగా రెండో రోజు మరో మ్యాచ్ టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన జైపుర్ పింక్ పాంథర్స్-తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా మారింది. శనివారం జరిగిన యుముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ కూడా టైగా ముగిసిన సంగతి తెలిసిందే.
తొలి అర్ధభాగంగలో జైపుర్ పింక్ పాంథర్స్ 21-16తో పైచేయి సాధించింది. రైడింగ్, డిఫెండింగ్‌లో సత్తాచాటుతూ తమిళ్ తలైవాస్‌ను ఒకసారి ఆలౌట్ చేసింది. కానీ అదే జోరును రెండో అర్ధభాగంలో కొనసాగించలేకపోయింది. మరోవైపు సెకండ్ హాఫ్‌లో తమిళ్ తలైవాస్ పుంజుకుకుంది. రైడర్లు విజృంభించారు. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయకుండానే ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

జైపుర్ పింక్ పాంథర్స్‌లో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ ఏడు పాయింట్లు, రైడర్ వికాస్ కండోలా ఆరు పాయింట్లు సాధించారు. తమిళ్ తలైవాస్‌లో సచిన్ 11 పాయింట్లతో రాణించాడు. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై యూపీ యోధాస్ 35-29తో విజయం సాధించింది. ఈ సీజన్‌లో యూపీకి ఇది మూడో విజయం. ఆల్‌రౌండర్ భరత్ 13 పాయింట్లో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ జెయింట్స్ రైడర్లు హిమాన్షు సింగ్ 9, రాకేశ్ 8 పాయింట్లు సాధించారు.

తొలి అర్ధభాగం హోరాహొరీగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి గుజరాత్ జెయింట్స్‌పై రెండు పాయింట్లే యూపీ యోధాస్ ఆధిక్యంలో ఉంది. అయితే సెకండ్ హాఫ్‌లో యూపీ దూకుడు పెంచింది. రైడింగ్, డిఫెండింగ్‌లో పైచేయి సాధించి మ్యాచ్‌ను ముగించింది. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో దబాంగ్ ఢిల్లీ, రాత్రి 9 గంటలకు పాట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.