ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ రెండో విజయం సాధించింది. వరుసగా ఏడు పరాజయాల అనంతరం తిరిగి గెలుపు బాట పట్టింది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ ఆ తర్వాత వరుసగా ఓటములపాలైంది. నొయిడా వేదికగా బుధవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47-28 తేడాతో ఘనంగా నెగ్గింది.
మ్యాచ్ ఆరంభం నుంచే బెంగాల్ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్ పైచేయి సాధించింది. బెంగాల్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. రైడింగ్, ట్యాకిల్‌లో దుమ్మురేపింది. ఫస్ట్ హాఫ్‌ను 24-13 పాయింట్లతో ముగించింది. రెండో అర్ధభాగంలోనూ పాయింట్ల జోరు కొనసాగించింది. ప్రత్యర్థి జట్టును ఒక్కసారి ఆలౌట్ చేసి 19 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

గుజరాత్ జెయింట్స్‌లో కెప్టెన్ గుమాన్ సింగ్ 17 పాయింట్లతో విజృంభించాడు. హిమాన్షు, దహియా, జితేందర్ తలో ఆరు పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో నితీన్ కుమార్ 11 పాయింట్లు, సుశీల్ 5 పాయింట్లు సాధించారు. నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో టేబుల్ టాప్ హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని సాధించింది. పట్నా పైరేట్స్‌పై 37-32 తేడాతో నెగ్గింది.
తొలి అర్ధభాగాన్ని హర్యానా స్టీలర్స్ 20-14తో ముగించింది. పట్నా పైరేట్స్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్‌లో పట్నా పుంజుకుంది. హర్యానాను ఆలౌట్ చేసి తిరిగి పోటీలోకి వచ్చింది. రెండో అర్ధభాగంలో హర్యానాపై ఒక్కపాయింటు ఆధిక్యాన్ని సాధించినప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లోని లోటుతో ఓటమి చవిచూసింది. హర్యానా జట్టులో వినయ్ (6), మహ్మద్‌రీజా (6), పాట్నా పైరేట్స్‌లో దేవాంక్ (7), అయాన్ (7) టాప్ స్కోరర్లు. కాగా, ఇవాళ యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ రాత్రి 8 గంటలకు, తమిళ్ తలైవాస్‌తో యు ముంబా రాత్రి 9 గంటలకు తలపడనున్నాయి.