ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో దబాంగ్ ఢిల్లీ సత్తాచాటుతోంది. శుక్రవారం నొయిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్‌పై ఢిల్లీ 35-21 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గత అయిదు మ్యాచ్‌ల్లో ఓటమెరుగని దబాంగ్ ఢిల్లీ (40) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. అయిదింట్లో రెండు మ్యాచ్‌లు టై అయిన విషయం తెలిసిందే. తొలి రెండు స్థానాల్లో హర్యానా స్టీలర్స (46), తెలుగు టైటాన్స్ (42) ఉన్నాయి.
మ్యాచ్ ఆరంభం నుంచే దబాంగ్ ఢిల్లీ పాయింట్ల మోత మోగించింది. తొలి అర్ధభాగాన్ని 17-9తో భారీ ఆధిక్యంతో ముగించింది. జైపుర్ పింక్ పాంథర్స్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. రెండో అర్ధభాగంలో జైపుర్ పుంజుకున్నప్పటికీ ఢిల్లీ ముందు నిలవలేకపోయింది. మరోసారి ఆలౌటై పాయింట్లు సమర్పించుకుంది. ఈ క్రమంలో దబాంగ్ 14 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయంలో కెప్టెన్ అషు మాలిక్ 9 పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. జైపుర్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు.

నొయిడా వేదికగా అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై యూపీ యోధాస్ 40-24 పాయింట్లతో ఘన విజయం సాధించింది. రైడర్ భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు, డిఫెండర్ హితేష్ 6 పాయింట్లతో సత్తాచాటారు. తలైవాస్ జట్టులో విశాల్ చాహల్, నితేశ్ కుమార్ తలో 6 పాయింట్లు సాధించారు. అయితే ఫస్టాఫ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు 13-13తో తొలి అర్ధభాగంలో సమంగా నిలిచాయి.
కానీ సెకండ్ హాఫ్‌లో తమిళ్ తలైవాస్ పేలవ ప్రదర్శన చేసింది. రెండు సార్లు ఆలౌట్ యూపీ యోధాస్‌కు పాయింట్లు ధారాళంగా సమర్పించుకుంది. యూపీ డిఫెండర్లు విజృంభించారు. కాగా, నొయిడా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు గుజరాత్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ జరగనుంది.