
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-24తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌పై గెలిచి విజయాల ఖాతా తెరిచింది. రైడింగ్‌లో బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ (7), ట్యాక్లింగ్‌లో విశాల్ భరద్వాజ్ (7) చెలరేగడంతో టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేసింది. గుజరాత్ తరఫున పర్వేష్ భైంస్వాల్ 7 టాకిలింగ్ పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సిద్దార్థ్ దేశాయ్ తొలి రైడ్‌లోనే టైటాన్స్‌కు పాయింట్ అందించాడు. మరోవైపు డిఫెండర్లు సత్తాచాటడంతో తొలి ఆరు నిమిషాలకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్.. 9-4తో ఆధిక్యంలో నిలిచింది. రైడర్లు రోహిత్ గులియా (5), సచిన్ (4) చెలరేగడంతో గుజరాత్ పుంజుకుంది. కానీ టైటాన్స్ ఆటగాళ్లు దూకుడు కొనసాగించి 17-13తో తొలి అర్ధ భాగాన్ని ముగించారు. రెండో అర్ధ భాగంలో కూడా టైటాన్స్ మరింత వ్యూహాత్మకంగా ఆడింది. రెండు జట్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే టైటాన్స్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్‌పై పట్టుసాధించింది. 30 నిమిషాల ఆటముగిసే సరికి 24-19తో టైటాన్స్ పైచేయి సాధించింది. ఆఖర్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వని టైటాన్స్.. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 33-30 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఆట ఆరంభంలో రోహిత్ కుమార్ (10), పవన్ సేరావత్ (5) పోటీపడి పాయింట్లు తేవడంతో బుల్స్ 6-1తో ఆధిక్యం సంపాదించింది. ఇదే ఊపులో పదో నిమిషంలో స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 12-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రైడింగ్‌లో వికాస్ కండోలా (11), ట్యాక్లింగ్‌లో వికాస్ కాలె (6) సత్తా చాటడంతో తిరిగి పుంజుకొన్న హరియాణా.. బుల్స్‌ను ఆలౌట్ చేసి తొలి అర్ధ భాగాన్ని 16-17తో ముగించింది. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన స్టీలర్స్.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో డిఫెండింగ్ చాంప్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాలకు హరియాణా బ్రేక్ వేసింది.